నారాయణ ఆగ్రహంలో రీజన్ ఉందంటారా?

Update: 2016-05-29 04:28 GMT
సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చే వరకూ బుద్ధిగా వ్యాపారం చేసుకున్నట్లు కనిపించిన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండానే రాష్ట్ర మంత్రి అయిపోయిన విషయం తెలిసిందే. తన స్కూళ్లల్లో చదివిన పిల్లలకు టాప్ టెన్ ర్యాంకులు వచ్చినప్పుడు మీడియా ముందుకు వచ్చేసి తమ పిల్లల్నిఅభినందించే నారాయణగా మాత్రమే తెలుగు ప్రజలకు తెలిసిన నారాయణలోని రాజకీయ కోణం గురించి తెలుసుకొని అవాక్కు అయిన పరిస్థితి.

చూసేందుకు అమాయకంగా.. నోట్లో నాలుక లేనట్లుగా ఉండే నారాయణను చూసినోళ్లంతా రాజకీయాల్లో రాణిస్తారా? సగటు రాజకీయ నేతలా నోరేసుకొని విరుచుకుపడతారా? అన్న సందేహాలు వచ్చినోళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి సందేహాలు ఏమీ అక్కర్లేదన్న విషయాన్ని స్వల్ప వ్యవధిలోనే స్పష్టం చేయటమే కాదు.. ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సంబంధించి భారీ బాధ్యతను నెత్తిన వేసుకొని తన సత్తా ఏమిటో చాటి చెప్పారు.

అంతేకాదు.. చాలా తక్కువ సమయంలోనే రాజకీయ వ్యాఖ్యలు చేయటంలో రాటుదేలటమే కాదు.. ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిన సమయంలో ఇలాంటివి తనకేం కొత్త కాదన్నట్లుగా వ్యవహరించటం చూసిన చాలామంది నారాయణ మామూలోడు కాదండోయ్ అనుకున్నారు. అలాంటి నారాయణకు తాజాగా మాజీ కేంద్రమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన దాసరి నారాయణ.. చిరంజీవిల మీద మా చెడ్డ చిరాకు వచ్చేసింది. రాజకీయ నాయకులుగా వారు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు చేసిన ఆయన.. వారిద్దరిని ఒకేసారి కలిపి ఏసుకున్నారు. ఎలాంటి మొహమాటానికి గురి కాకుండా ఇద్దరు మాజీ కేంద్రమంత్రులు కాపులకు ఏం చేశారంటూ నేరుగా ప్రశ్నించిన ఆయన.. కేంద్రమంత్రులు గా ఉండి కాపుల రిజర్వేషన్ల విషయంలో ఏమీ చేయలేదని స్పష్టం చేశారు.

ఇలాంటి నేతల్ని దగ్గరకు చేర్చుకోవద్దని కాపులకు హితవు పలికిన ఆయన.. దాసరి కొన్నిరోజుల క్రితం జగన్ ను కలిశారని.. ఇటీవల ముద్రగడ పద్మనాభం కోసం జగన్ ను కలిసినట్లుగా ఆరోపించారు. జగన్ చెప్పినట్లే వారిద్దరూ పని చేస్తున్నట్లుగా చెప్పిన ఆయన.. చిరంజీవిని కాపులు నమ్ముకున్నారని.. కానీ వారిని నట్టేట ముంచేసి కాంగ్రెస్ లో కలిసిపోవటాన్ని ప్రస్తావించారు. కాపుల హక్కుల్ని రక్షించే బాధ్యత తమ సర్కారుదేనన్న విషయాన్ని స్పష్టం చేసిన నారాయణ.. కాపుల రిజర్వేషన్ల విషయంలో బాబు సర్కారు కసరత్తు చేస్తుందన్నారు. ప్రస్తుతానికైతే కాపుల పక్షాన మాట్లాడుతున్న దాసరి.. చిరంజీవిలపై మంత్రి నారాయణ మాటలదాడిలో అర్థం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. తాను చెప్పినట్లే కాపుల రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని వీలైనంత త్వరగా నెరవేర్చేలా చేస్తే కాపు వర్గాల్లో నారాయణ క్రెడిబులిటీ పెరుగుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News