మోడీకి రిలీఫ్ః ఆయన్ను విచారించరట

Update: 2017-01-13 16:41 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంక్రాంతి పండుగ ముందు తీపికబురు దక్కింది. పెద్ద నోట్ల రద్దు అంశంలో ప్రధాని నరేంద్రమోడీని తమ ఎదుట హాజరవ్వాలంటూ  పిలవరాదని పార్లమెంటులోని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. నోట్ల రద్దుపై పార్లమెంటు పీఏసీ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ  సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మోడీని పిలువకూడదని పీఏసీ నిర్ణయించింది.

పెద్దనోట్ల రద్దు చేసిన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీని పార్లమెంట్‌ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ప్రశ్నించనుందని వార్తలు వెలువడ్డాయి. నోట్ల రద్దుపై తాము రూపొందించిన ప్రశ్నావళికి ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధానాధికారులు, ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేనిచో నేరుగా ప్రధానమంత్రికే సమన్లు జారీచేయాలని పీఏసీ భావించింది. ఈ నెల 20న ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ - ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌ లవాస - ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శశికాంత దాస్‌ తో జరగనున్న సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఆయా వ‌ర్గాల‌కు ఓ ప్రశ్నావళిని పంపామని, దానికి సమాధానాలు త్వరలోనే వచ్చే అవకాశ ముందని - అనంతరం ఈ నెల 20న దానిపై చర్చిస్తామని పీఏసీ చైర్మన్‌ - కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీ థామస్‌ తెలిపారు. ఒకవేళ ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఈ వ్యవహారంతో సంబంధ మున్నవారెవరినైనా విచారించే అధికారం తమకు ఉందన్నారు. అయితే అది జనవరి 20 తర్వాతే తెలుస్తుందన్నారు. సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయిస్తే నోట్ల రద్దుపై ప్రధానమంత్రిని విచారిస్తామన్నారు. నవంబర్‌ 8న నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రధాని నరేంద్రమోడీని తాను కలిశానని, అయితే 50 రోజుల్ల పరిస్థితి సాధారణ స్థాయికి వస్తుందని, డిసెంబర్‌ చివరినాటికి చక్కబడుతుందని తెలిపారని థామస్‌ పేర్కొన్నారు. కానీ నేటికీ అలాంటి సూచనలు కనిపించడం లేదన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న అంశం కాబట్టి దీనితో సంబంధం ఉన్న వారిని విచారించాలని పీఏసీ నిర్ణయించిందన్నారు.

థామస్ చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ డిమాండ్ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విచారించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో వెనక్కుతగ్గిన పీఏసీ ఈ విషయంలో పునరాలోచించుకున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News