ఈ మహిళా నేతా పార్టీకి దూరమైపోతున్నారా ?

Update: 2020-12-10 15:29 GMT
మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి తెలుగుదేశంపార్టీలో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబునాయుడు నాయకత్వం మీద నమ్మకం లేక కొందరు నేతలు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే కారణంగా మరికొందరు నేతలు పార్టీని వదిలేయటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబే కొందరు నేతలను దూరంగా పెట్టేశారు. చంద్రబాబు దూరంగా పెట్టేసిన నేతలెవరికీ టీడీపీని వదిలి పెట్టాలని లేకపోయినా నిరాధరణ కారణంగానే పార్టీని వదిలేయటనికి రెడీ అయిపోతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది.

చంద్రబాబు నిరాధరణ కారణంగా పార్టీని వదిలేయటానికి రెడీగా ఉన్న నేతల్లో మాజీమంత్రి పడాల అరుణ కూడా ఒకరు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజికవర్గాల్లో ఒకటైన తూర్పుకాపుకు చెందిన నేత పడాల. 1989, 1994, 2004 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం నుండి గెలిచారు. 1994లో చంద్రబాబు మంత్రివర్గంలో కూడా పనిచేశారు. జిల్లాలో విస్తృతమైన పరిచయాలు, సామాజికవర్గంలో గట్టిపట్టున్న పడాల 2009లో ఓడిపోయారు. తర్వాత 2014లో అసలు టిక్కెట్టే దక్కలేదు.

నిజానికి 2009లో ఓడిపోయిన దగ్గర నుండే పడాలకు బ్యాడ్ టైం స్టార్టయినట్లే అనుకోవాలి. ఎందుకంటే అప్పటి నుండే చంద్రబాబు ఆమెను దూరం పెట్టేయటం మొదలుపెట్టారు. కారణాలు తెలీదు కానీ ఆమె స్ధానంలో కొండపల్లి అప్పలనాయుడుకు కేటాయించారు. అప్పటి నుండి చంద్రబాబే కాదు జిల్లాలోని పార్టీ నేతలు కూడా ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజు అసలు పట్టించుకోవటమే మానేశారు. దాంతో ఆమె పార్టీ కార్యాలయానికి కూడా దూరమైపోయారు.

చంద్రబాబును కలుద్దామని అమరావతికి వచ్చినా, అశోక్ ను కలుద్దామని గజపతుల కోటకు వెళ్ళినా కలవటానికే ఇష్టపడలేదట. దాంతో తీవ్రమనస్తాపంతో ఆమె పార్టీ కార్యక్రమాలకే దూరమైపోయారు. ఇపుడు ఆమెను పార్టీలో పలకరించే వారే లేకపోయారు. అలాగే ఆమె కూడా పార్టీ అంటేనే దూరంగా ఉంటున్నారు. ఇంత నిరాధరణకు గురవుతు టీడీపీలోనే కంటిన్యు అవ్వాల్సిన అవసరం ఏమిటంటు ఆమె మద్దతుదారులు గట్టిగానే నిలదీస్తున్నారని సమాచారం.

ఇటువంటి నేపధ్యంలోనే ఈమెపై కమలంపార్టీ నేతల కన్ను పడింది. ఈమధ్యే మరో సీనియర్ నేత గద్దె బాబూరావును పార్టీలోకి చేర్చుకున్నట్లే పడాల అరుణను కూడా బీజేపీలోకి చేర్చుకోవటానికి కమలంపార్టీ నేతలు పావులు కదుపుతున్నారట. ఒకవైపు టీడీపీలో అనాధరణ మరోవైపు బీజేపీ నుండి ఆహ్వానం వస్తుండటంతో సహజంగానూ ఆమె ఆలోచనలు కమలంపార్టీ వైపు మళ్ళుతున్నాయి. దాంతో తొందరలోనే ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారనే ప్రచారం పెరుగుతోంది.
Tags:    

Similar News