ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌ .. తులసి గౌడకి పద్మ శ్రీ .. 72 ఏళ్ల బామ్మా ఎవరంటే ?

Update: 2021-11-10 01:30 GMT
తులసీ గౌడ .. కర్ణాటకకు చెందిన 72ఏళ్ల మహిళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఓ సాధారణ చీర మాత్రమే ధరించి, చెప్పుల్లేని కాళ్లతోనే పద్మ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసీ గౌడను దేశ  నాలుగో అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించారు.  కర్ణాటకలోని హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ తులసీ గౌడ. పేద కుటుంబానికి చెందిన ఆమె  జీవితంలో ఎప్పుడూ రెగ్యూలర్ చదువులు చదువుకోలేదు. అయినప్పటికీ ఆమెను ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు.

ఔషద మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన జ్ఞానం ఉన్న వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. ఒక గిరిజన కుటుంబంలో జన్మించిన ఓ మహిళ పద్మ శ్రీ అవార్డు అందుకునే స్థాయికి ఎలా ఎదిగారు.  ఇంతకీ ఆమె సాధించిన ఆ గొప్ప పని ఏంటన్న విషయాలు తెలియాలంటే ఈ ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే.  తులసి గౌడ.. కర్ణాటకలోని అంకోలా తాలుకా హొన్నాలి గ్రామంలో హలక్కీ అనే గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె జన్మించిన రెండేళ్లకే తండ్రి మరణిచారు. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూలీ పనికి వెళ్లేవారు. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు వివాహ జరిగింది. అయితే వివాహమైన రెండేళ్లకే భర్త కూడా మరణించడంతో ఆ బాధ నుంచి బయట పడేందుకు అడవిలో గడుపుతూ  చెట్లతో స్నేహం చేయడం మొదలు పెట్టారు.

అలా ఆమెకు తెలియకుండానే మొక్కలపై ప్రేమను పెంచుకుంది. నిత్యం చెట్లతో ఉండడంతో అది గమినించిన అటవీ శాఖ అధికారులు తులసికి తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకుని కొన్నేళ్ల తర్వాత పర్మినెంట్‌ చేశారు. 14 ఏళ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగ విమరణ పొందారు. అయితే చెట్లతో ఆమె బంధాన్ని మాత్రం తెంపుకోలేక పోయారు. ఇప్పటికీ మొక్కలు నాటుతూనే ఉన్నారు. నాటడమే కాకుండా వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. అంతేకాకుండా 72ఏళ్ల వయస్సులోనూ.. యువతకు సూచనలిస్తూ మొక్కలు నాటడం గురించి చెప్తుంటారు. వాటిలో మెలకువల గురించి వివరిస్తుంటారు. ఒక్క మొక్క నాటి దాంతో సెల్ఫీ దిగి, ఆ తర్వాత ఆ మొక్క బ్రతికిందో లేదో అన్న సంగతి కూడా పట్టించుకోకుండా కేవలం నాటి  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసుకునే వారున్న ఈ రోజుల్ల. 40 వేల మొక్కలు నాటి కూడా ఎంతో నిరాడంబరంగా ఉన్న తులసి నిజంగానే గ్రేట్.

రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 10మందికి పద్మ భూషణ్, 102 పద్మ శ్రీ అవార్డులు అందజేశారు. 29మంది మహిళలు ఉండగా, ఒక ట్రాన్స్‌జెండర్ కు అవార్డు దక్కింది. ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీస్ లాంటి పలు విభాగాల్లో నుంచి పద్మ అవార్డులకు ఎంపిక చేశారు.
Tags:    

Similar News