కేసీఆర్ దగ్గర ఆ ఎమ్మెల్యే ఏడ్చేశారా?

Update: 2016-08-17 04:10 GMT
నయిం ఎన్ కౌంటర్ ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గ్యాంగ్ స్టర్ గా మాత్రమే సుపరిచితుడైన నయిం వెనుక కథ మొత్తం బయటకు వస్తున్న వేళ.. అతగాడి వ్యవహారం ఇప్పుడు ఒళ్లు జలదరించేలా ఉంది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా కంటికి కనిపించిన ప్రతిఒక్కరిపైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. తాను కోరుకున్నది ఏదైనా సరే తన సొంతం కావాలనుకునే తీరు పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి కూడా.. ఒక వ్యక్తి చేతిలో ఇంతలా కీలుబొమ్మలా మారిపోయాయన్న సందేహం ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తోంది.

బడా వ్యాపారస్తులు.. రియల్టర్లు.. పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా బెదిరించిన వైనం చూసినప్పుడు.. నయిం విడిచిపెట్టింది ఎవరిన్న సందేహం కలగక మానదు. నయిం ఎపిసోడ్ కు సంబందించిన ఒక ఆసక్తికర వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. నల్గొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల రాజశేఖర్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి.. ఏడ్చినంత పని చేసినట్లుగా చెబుతున్నారు. తనను చంపుతానని చాలా తీవ్రంగా  వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో హడలిపోయిన అతగాడు.. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వచ్చి వాపోయి.. జరుగుతున్న దారుణాల్ని ఏకరువుపెట్టటం.. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేనన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా వార్నింగ్ ఇవ్వటాన్ని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేమాటలు విన్న తర్వాత ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్న కేసీఆర్.. నయింను టార్గెట్ చేసేందుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు.

సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావటంతో నయిం గాలింపు చర్యలు మరింత తీవ్రతరం చేసినట్లుగా చెబుతున్నారు.. దాదాపు మూడు నెలల వెతుకులాట అనంతరమే నయిం ఆచూకీ లభించిందన్న మాట వినిపిస్తోంది. కార్బన్ సెర్చ్ పేరిట హైదరాబాద్.. హైదరాబాద్ పరిసరాల్లో పోలీసులు  ప్రారంభించిన నేపథ్యంలో.. బస్తీల్లో నివాసం ఉంటే అడ్డంగా బుక్ అయిపోవటం ఖాయమన్న ఆలోచనతోనే మిలీనియం టౌన్ షిఫ్ కు మారినట్లుగా అంచనా వేస్తున్నారు.

ఒక బస్తీతో పోలిస్తే.. సంపన్నుల నివాసం ఉంటే సముదాయాల్లో పోలీసుల కన్ను పెద్దగా ఉండదన్న ఆలోచనలో మిలీనియం టౌన్ షిఫ్ట్ అయినట్లుగా చెప్పొచ్చు. బస్తీలో ఉంటే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో.. మిలీనియం టౌన్ షిప్ లో మారితే పోలీసుల కళ్లు ఇట్టే కప్పేయొచ్చన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. సంపన్నులు ఉండే కాలనీలో అతడు పాగా వేసిన విషయాన్ని గుర్తించిన పోలీసులు వ్యూహాత్మకంగానే అతన్ని ఎన్ కౌంటర్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. నయాం ఆరచకాలు గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వచ్చినప్పటికీ.. ఎప్పుడైతే తన ఎమ్మెల్యేపైనే వార్నింగ్ ఇచ్చారన్న విషయాన్ని తెలుసుకున్నారో అదే నయిం చావుకు కారణమైందన్న మాట రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News