ఆరేళ్లలోనే రూ. వేల కోట్లు పోగేసిన ఆ నేత!

Update: 2022-11-23 07:31 GMT
పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా వ్యవహారం ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. కేవలం ఆరు అంటే ఆరేళ్లలోనే జావెద్‌ బజ్వా రూ.వేల కోట్లు వెనకేసుకోవడమే ఇందుకు కారణం. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా భారీగా ఉన్నాయని చెబుతున్నారు.

ఆదాయపన్ను రికార్డుల ఆధారంగా పాకిస్థాన్‌కు చెందిన ఫ్యాక్ట్‌ ఫోకస్‌ వెబ్‌సైట్‌ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా ఆస్తులపై సంచలన కథనం ప్రచురించింది. ఫ్యాక్ట్‌ ఫోకస్‌ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం.. బజ్వా ఆస్తుల విలువ రూ.1,270 కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ ఆస్తుల్లో కొన్ని పాకిస్థాన్‌లో, మరికొన్ని విదేశాల్లో ఉన్నాయి.

ఈ రూ.1,270 కోట్ల ఆస్తులు కేవలం ఆదాయపన్ను రికార్డుల ఆధారంగా ఉన్నవే కావడం గమనార్హం. ఇక లెక్కచెప్పని.. లెక్కచూపని ఆస్తులు ఇంకా భారీగానే ఉంటాయని చెబుతున్నారు.

ఖమర్‌ జావేద్‌ బజ్వాతో ఆయన భార్య, కోడలు ఆస్తులు కూడా భారీగా పెరగడం గమనార్హం. బజ్వా భార్య ఆయేషా అంజాద్‌ ఆస్తులు అసలు ఏమీ లేని స్థాయి నుంచి ఏకంగా రూ.220 కోట్లకు చేరడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

ఇక బజ్వా కుమారుడు సాద్‌ బజ్వాతో మహనూర్‌కు 2018 నవంబరు 2 వివాహం కాగా.. పెళ్లికి తొమ్మిది రోజుల ముందే ఆమె ఆస్తులు రూ.127 కోట్లకు చేరడం గమనార్హం. అక్టోబరు చివరి వారంలోనే తన పేరిట ఎటువంటి ఆస్తుల్లేవని మహనూర్‌ ఆదాయపన్ను శాఖకు వివరాలు అందించారు. ఇంతలోనే నవంబర్‌ నాటికి ఆమె ఆస్తులు బుల్లెట్‌ ట్రైన్‌ వేగంతో పెరిగిపోయాయి.

ఇక, మహనూర్‌ మాదిరిగానే ఆమె తండ్రి సాబిర్‌ హమీద్‌ ఆస్తులు 2013లో రూ.10 లక్షల కంటే తక్కువే ఉండగా ఇప్పుడు ఆయన ఆస్తులు పెరిగిపోయాయి. వివిధ రూపాల్లో రూ.120 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా 2016 నవంబరు 29న బజ్వా బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ దేశ సైన్యానిదే అధికారంలో కీలకపాత్ర అనే సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ ఏర్పడ్డాక ఎన్నోసార్లు ప్రజా ప్రభుత్వాలను కూలదోసి సైన్యం అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో సైన్యాధిపతిగా కీలక పాత్ర పోషిస్తున్న ఖమర్‌ జావెద్‌ బజ్వా ఈ ఆరేళ్లలో రూ.వేల కోట్ల రూపాయలు సంపాదించినట్టు చెబుతున్నారు. ఈ నవంబర్‌ చివర ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్‌ ఫోకస్‌ వెబ్‌సైట్‌ సంచలన కథనం ప్రచురించడం గమనార్హం. ఇప్పుడు ఇది పాకిస్థాన్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమవుతోంది.

ఓవైపు దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంటే ప్రభుత్వంలో ముఖ్య నేతలు, సైన్యాధిపతులు అవినీతికి పాల్పడుతూ వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, సైనిక చీఫ్‌ ఆదాయపు పన్ను రిట్నర్స్‌ పత్రాలు లీక్‌ కావడంపై పాక్‌ ఆర్థికమంత్రి ఇషాద్‌ దార్‌ విచారణకు ఆదేశించారు. బాధ్యులెవరో 24 గంటల్లోపు తేల్చాలన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News