ఇమ్రాన్ ఖాన్ మాట వింటే ఇన్ని కష్టాలు ఉండేవి కావా?

Update: 2019-06-17 06:15 GMT
ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచంటే అది సంగ్రామమే.. అందులోనూ వరల్డ్ కప్‌ లో జరిగే మ్యాచంటే మహా సంగ్రామమే. ఆదివారం జరిగిన అలాంటి మహా సంగ్రామంలోనే పాకిస్తాన్ జట్టును ఇండియా చిత్తుచిత్తు చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌ కు ముందు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ జట్టుకు కీలక సలహా ఒకటి ఇచ్చారు. ఒకప్పుడు పాకిస్తాన్‌ కు వరల్డ్ కప్ అందించిన జట్టుకు కెప్టెన్‌ గా పనిచేసిన ఇమ్రాన్ ఇచ్చిన ఆ సలహాను ప్రస్తుత పాక్ కెప్టెన్ పాటించకపోవడమే ఆ జట్టు కొంపముంచిందని పాక్ అభిమానులు ఇప్పుడు మండిపడుతున్నారట. ప్రధాని మాట విని ఉంటే భారత్‌ పై గెలవలేకపోయినా గట్టి పోటీ ఇచ్చి ఉండేవారమని.. ఇంత దారుణ పరాజయం తప్పేదని అంటున్నారట.

ఇంతకీ ఇమ్రాన్ ఏం చెప్పాడు..?

ఆదివారం మ్యాచ్‌ లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిస్తే ముందు బ్యాటింగ్‌ ఎంచుకోవాలని ఇమ్రాన్‌ ట్విట్టర్‌ లో సూచించాడు. ఆయన కోరుకున్నట్లే పాకిస్తాన్ టాస్ గెలిచింది.. కానీ, ఆయన సూచించినట్లుగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోలేదు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ లో భారత్  డక్‌ వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం 89 పరుగుల తేడాతో పాక్‌ ను చిత్తుచేసింది. తొలుత భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేయగా, సమాధానంగా పాకిస్తాన్‌ 40 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.
ఇమ్రాన్ సూచన ఎందుకంత కీలకం..?

ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతున్న లండన్‌ లో వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికే పలు మ్యాచులు రద్దయ్యాయి. మరికొన్ని డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓవర్లు, లక్ష్యం కుదించారు. మ్యాచ్ రద్దయితే ఎవరూ ఏమీ చేయలేరు. పాయింట్లు సమానంగా పంచుతారు. కానీ... డక్‌ వర్త్ లూయిస్ పద్ధతి అమలైతే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు కష్టమవుతుంది. వర్షం ఎక్కువ సేపు పడి రెండు జట్లకూ ఓవర్లు తగ్గిస్తే పెద్ద నష్టం ఉండదు. కానీ, తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 50 ఓవర్లు ఆడి రెండో జట్టు తక్కువ ఓవర్లు ఆడితే లక్ష్యంలో మార్పు వస్తుంది.. సాధన కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాన్ని గ్రహించే ఇమ్రాన్ ఈ సూచన చేశారు. ఆయన ఊహించినట్లే మ్యాచ్‌ కు వర్షం వల్ల అంతరాయం కలిగింది ఇండియా 50 ఓవర్లు ఆడి భారీ స్కోరు చేయగా.. ఆ తరువాత వర్షం వల్ల పాక్ ఇన్నింగ్స్ 40 ఓవర్లకు తగ్గించారు. కానీ.. లక్ష్యం మాత్రం 302 పరుగులు. దీంతో చివరి 5 ఓవర్లలో 136 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పటికే కష్టాల్లో ఉన్న పాక్ ఈ టార్గెట్‌ కు ఏమాత్రం దగ్గరకు రాలేకపోయింది.


Tags:    

Similar News