పాక్ ‘అణు’ పెద్ద దిక్కు ఇక లేరు.. లైఫ్ అంతా వివాదాలే

Update: 2021-10-11 04:12 GMT
దాయాది పాకిస్థాన్ కు పెద్ద దిక్కుగా.. ఆ దేశానికి అణు సామర్థ్యాన్ని అందించిన వివాదాస్ప శాస్త్రవేత్త.. పాక్ అణు పితామహుడిగా పేరున్న అబ్దుల్ ఖదీర్ ఖాన్ తన 85వ ఏట కన్నుమూశారు. ఈ మధ్యనే కరోనా బారిన పడిన ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో పాటు.. ఊపిరితిత్తుల్లో రక్త స్రావం కావటంతో ఆయన మరణించారు. ఇస్లామాబాద్ లో ఆయన పేరు మీదనే ఉన్న ఖాన్ రీసెర్చ్ లేబొరేటరీస్ లో ఆదివారం తుదిశ్వాస విడిచినట్లుగా వెల్లడించారు.

ఆయన మరణంపై పాక్ అధ్యక్షులు.. ప్రధానితో సహా ఇతర ప్రముఖులంతా తమ విచారాన్ని వెల్లడించారు. దేశం ఆయన్ను ఎంతో ప్రేమిస్తుందని.. జాతి భద్రత కోసం ఆయన దేశానికి అణ్వాయుధాల్ని ఇచ్చారని.. పాక్ ప్రజల హీరోగా ఆయన్ను అభివర్ణిస్తూ ఇమ్రాన్ ఖాన్ పొగిడారు. వాస్తవానికి అబ్దుల్ ఖదీర్ ఖాన్ పుట్టింది భారత్ లోని భోపాల్ నగరంలో. 1936లో జన్మించిన ఆయన కుటుంబం దేశ విభజన వేళలో భోపాల్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిపోయారు. కరాచీలోని డీజే సైన్స్ కాలేజీలో ప్రాధమిక విద్యను అభ్యసించి.. 1961లో ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లారు. అక్కడ పీహెచ్ డీ చేసిన ఆయన జర్మనీ.. హాలాండ్ వర్సిటీల్లోనూ పీహెచ్ డీలు చేశారు.

1998లో పాకిస్థాన్ తొలిసారి అణు పరీక్షను చేసినప్పుడు ఆయన పాక్ జాతీయ హీరోగా మారారు. అణు పరీక్షల అనంతరం.. ముస్లిం దేశాల్లో పాకిస్థాన్ ఏకైక అణుశక్తి కలిగిన దేశంగా మారింది. ప్రపంచంలో ఈ సత్తా ఉన్న ఏడో దేశంగా నిలిచింది.  దేశాన్ని అణ్వాయుధ సంపన్న దేశంగా మార్చినందుకు ఆయన్ను పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు.

భారత్ తన తొలి అణు పరీక్షల్ని నిర్వహించటంతో పాకిస్థాన్ సైతం ఆ శక్తిని కలిగి ఉండటం చాలా అవసరమని నాటి దేశాధ్యక్షుడు అలీ భుట్టోకి లేఖ రాశారు. బంగ్లాదేశ్ ఏర్పాటుతో రగిలిపోతున్న పాక్ కు.. అణు శక్తి అవసరాన్ని మరోసారి చెప్పటంతో ఆయనకు ప్రాజెక్టు చేపట్టేందుకు నాటి పాక్ ప్రభుత్వం ఓకే చెప్పింది. నెదర్లాండ్ అణుకేంద్రం నుంచి ఖరీద్ 1975లో హటాత్తుగా వెళ్లిపోయారు. అణ్వాయుధాల తయారీలో కిలకమైన  సెంట్రిప్యూజ్ లు.. ఇతర పరికరాల నమూనాలు.. యురేనియం ఎన్రిచ్‌మెంట్ టెక్నాలజీని తస్కరించారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ తొలి న్యూక్లియర్ వెపన్ అభివృద్ధిలో ఆ టెక్నాలజీని ఆయన ఉపయోగించారని చెబుతుంటారు.

అణు శక్తిని అందించటంలో ఖదీర్ కు స్వదేశంలో కీర్తిప్రతిష్ఠలు అందుకోగా.. అంతర్జాతీయంగా మాత్రం ఆయనకు చెడ్డపేరును తీసుకొచ్చింది. అనంతరం ఇరాన్.. నార్త్ కొరియాతో ఖదీర్ అణు వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అణు రహస్యాల్ని ఇతర దేశాలతో పంచుకున్నారంటూ ఆయనపై అమెరికా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది.

అణురహస్యాల్ని పలు దేశాలకు రహస్యంగా అమ్మేస్తున్నారంటూ అతనిపై వచ్చిన ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ కావటం.. 2004లో పెద్ద ఎత్తున రావటంతో ఆయన జీవితం మారిపోయింది. అమెరికా సహా అంతర్జాతీయ దేశాలు ఆయన వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. ఇరాన్.. లిబియా..ఉత్తర కొరియా లాంటి దేశాలకు అణు టెక్నాలజీని రహస్యంగా అంగీకరించటంతో ఖదీర్ అప్రదిష్టపాలు కావటంతో పాటు.. ఆ తర్వాత నుంచి భద్రతా దళాల నిఘా మధ్యనే ఆయన హౌస్ అరెస్టు కాబడ్డారు. అయితే.. తాను తప్పు చేయలేదని.. అప్పటి దేశాధ్యక్షుడు ముష్రారఫ్ బలవంతంతోనే అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందన్న మాట ఆయన నోటి నుంచి తర్వాతి కాలంలో బయటకు రావటం గమనార్హం.

ఇస్లామాబాద్ హైకోర్టు 2009లో ఆయన్ను  హౌస్ అరెస్టు నుంచి బయటకు విడుదల చేసింది. పాకిస్థాన్ 1984లోనే అణుశక్తిగా ఎదిగేదని.. కానీ అప్పటి దేశాధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ అందుకు ఒప్పుకోలేదన్నారు. కథువా ప్లాంట్ నుంచి ఢిల్లీని ఐదు నిమిసాల్లో దెబ్బ కొట్టే సామర్థ్యం పాక్ కు ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. 1983లో నెదర్లాండ్స్ కోర్టు అణు గూఢచర్యం కేసులో ఖదీర్ ను దోషిగా తేల్చి నాలుగేళ్లు జైలు విదించింది. అయితే.. తనకు సమన్లు అందలేదని చెబుతూ ఈ విచారణకు ఖదీర్ హాజరు కాలేదు. ఆయనకు పాక్ ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆయన్ను పాకిస్థాన్ నుంచి తీసుకెళ్లటం సాధ్యం కాలేదు. పలు వివాదాలు.. ఆరోపణలతో ఆయన జీవితం సాగింది. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. పాక్ కు అణుశక్తిని అందించటంలో మాత్రం ఆయన కీలకభూమిక పోషించారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News