అమరావతిపై పాకిస్థాన్ అక్కసు

Update: 2016-06-08 09:39 GMT
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని చూసి పాకిస్థాన్ అసూయపడుతుందో.. లేదంటే భయపడుతుందో తెలియదు కానీ అమరావతిపై తన అక్కసంతా వెళ్లగక్కుతూ అక్కడి మీడియా కథనాలు వెలువరిస్తోంది. అమరావతి నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.  ఉద్ధృతంగా సాగుతున్న ఆంధ్రుల సరికొత్త రాజధానిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తోంది.  ఈ నెల 3న పాక్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా గోష్టి సందర్భంగా ఆ దేశానికి చెందిన ఓ విశ్లేషకుడు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ అమెరికాపై ప్రయోగించేందుకు హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని ఆరోపించాడు.

అమరావతిలో శాసనసభ - కోర్టులు - సెక్రటేరిట్ల డిజైన్లను సింగపూర్ సంస్థలు ఇవ్వడం.. అది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించడం తెలిసిందే. అయితే.. ఆ డిజైన్లలోని శాసనసభ భవనానికి తొలుత ఇచ్చిన డిజైన్ లో ఉన్న ఓ డోమ్ వంటి ఆకారాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ పాకిస్థాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది న్యూక్లియర్ బాంబుల తయారీ కేంద్రమని పేర్కొంటూ గత నెలలోనూ అక్కడి పత్రికల్లో కథనాలు వచ్చాయి. తాజాగా టీవీ చర్చావేదికల్లో మరో అడుగు ముందుకేసి అమెరికాపై ప్రయోగించడానికి హైడ్రోజన్ బాంబులు అక్కడ తయారుచేస్తున్నారంటూ విషం చిమ్మారు.  ఇలాంటి మీడియా కథనాలకు తానా అంటే తందానా అంటూ పాక్ ప్రభుత్వం కూడా ఏపీలో నిర్మాణాలపై తాము దృష్టి పెడుతున్నామని.. అక్కడ ఏం జరుగుతుందో ఓ కన్నేసి ఉంచుతామని ప్రకటించింది.

కాగా ఇటీవల కాలంలో అమెరికా - భారత్ బంధం బలోపేతం అవుతుండడంతో దాన్ని భగ్నం చేసేందుకే పాక్ ఇలాంటి కుట్రలు పన్నుతోందని తెలుస్తోంది. అయితే.. అసలే అష్టకష్టాల్లో ఉన్న ఏపీపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తుండడంతో అంతర్జాతీయంగా అనవసర అనుమానాలు తలెత్తుతాయని.. అది ఏపీ అభివృద్ధికి ఆటంకమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News