ఆఖ‌రి నిమిషంలో పాక్ కు షాకిచ్చిన భార‌త్‌

Update: 2017-12-31 05:22 GMT
ప్ర‌తి ఒక్క భార‌తీయుడి గుండె మండిపోయేలా చేయ‌ట‌మే కాదు.. పాక్ దుర్నీతికి ప్ర‌పంచం మొత్తం ఈస‌డించుకునేలా చేసిన  వైనంపై భార‌త ప్ర‌భుత్వం ఎంత ఆగ్ర‌హంగా ఉంద‌న్న విష‌యాన్ని తెలియ‌జేసే ఉదంతం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. భార‌త నేవీ మాజీ అధికారి కుట‌భూష‌ణ్ పాక్ జైల్లో మ‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. భార‌త గూఢాచారిగా ముద్ర వేసి.. అక్ర‌మంగా జైల్లో ఉంచిన అతన్ని చూసేందుకు అత‌డి త‌ల్లి.. భార్య‌కు ఈ మ‌ధ్య‌న అనుమ‌తి ఇవ్వ‌టం తెలిసిందే.

జాద‌వ్ ను క‌ల‌వ‌టానికి వెళ్లే ముందు అత‌డి కుటుంబ స‌భ్యుల్ని అవ‌మానించే ప‌నిలో భాగంగా వారి నుదుట సింధూరాన్ని.. మంగ‌ళసూత్రాన్ని తీయించిన వైనంపై భార‌త్ తో స‌హా ప‌లు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ విష‌యంపై పార్ల‌మెంటులో సైతం చ‌ర్చ‌కు వ‌చ్చి.. అన్ని పార్టీలు పాక్ తీరును త‌ప్పు ప‌ట్టాయి. ఇదిలా ఉండ‌గా..ఈ ఉదంతానికి త‌గిన రీతిలో బ‌దులు తీర్చుకోవాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉంద‌న్న విష‌యం తాజా ఉదంతంతో స్ప‌ష్ట‌మైంది.

పాక్ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నట్లుగా భార‌త్ త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తూ దాయాది దేశానికి భారీ షాకిచ్చింది.  పాక్ నుంచి భార‌త్‌కు రావాల్సిన 192 మంది యాత్రికుల‌కు చివ‌రి నిమిషంలో వీసాలు నిరాక‌రించింది. దీనిపై పాక్ స‌ర్కారు ఇప్పుడు విల‌విల‌లాడుతోంది.

జ‌న‌వ‌రి 1 నుంచి 8 వ‌ర‌కు ఢిల్లీలోని హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ ద‌ర్గాలో ఉర్సు వేడుక‌లు జ‌రగ‌నున్నాయి. ముస్లింలు మ‌క్కా త‌ర్వాత అత్యంత ప్ర‌విత్ర‌మైన ప్ర‌దేశాలుగా భావించే వాటిల్లో హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ ఒక‌టి. ఇక్క‌డ జ‌రిగే ఉర్సు కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌టానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు కొంద‌రు వ‌స్తుంటారు. ఈ వేడుక‌ల్లో పాల్గొన‌టానికి పాకిస్థాన్ నుంచి 200 మంది యాత్రికులు వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వారి ద‌ర‌ఖాస్తుల్ని తాజాగా భార‌త్ వీసాలు ఇచ్చేందుకు నిరాక‌రించి తిర‌స్క‌రించింది.

భార‌త్ తీసుకున్న నిర్ణ‌యంతో పాక్ అధికారుల‌తో స‌హా.. యాత్రికులు షాక్ తిన్నారు. భార‌త్ తీసుకున్న నిర్ణ‌యం విచార‌క‌ర‌మంటూ పాక్ విదేశాంగ శాఖ స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. ఆఖ‌రి నిమిషంలో తీసుకున్న ఈ చ‌ర్య స‌బ‌బేనా? అంటూ ప్ర‌శ్నిస్తూ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

దేశం కాని దేశానికి.. అయిన వారిని చూసేందుకు వ‌చ్చిన ఇద్ద‌రు మ‌హిళ‌ల ప‌ట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రించి.. అవ‌మానించ‌ట‌మే కాదు.. మీడియాను ఉసిగొల్పిన పాక్ కు త‌న దుర్మార్గం గురించి చింత లేదు కానీ.. భార‌త్ తీసుకున్న నిర్ణ‌యం మీద మాత్రం త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. తాజా చ‌ర్య రెండు దేశాల మ‌ధ్య ఉన్న దౌత్య సంబంధాల్ని దెబ్బ తీసేలా ఉంద‌ని .. ఇది ముమ్మాటికి మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని పేర్కొంది. నీతులు చెప్ప‌టానికి అవ‌స‌ర‌మైన క‌నీస అర్హ‌త త‌మ‌కుందా? అని పాక్ ఆలోచించుకోవాల్సిన వేళ‌.. సుద్దులు ప‌లక‌టం చూస్తే.. దాయాది తీరు ఇట్టే అర్థం కాక మాన‌దు.
Tags:    

Similar News