అయ్యో పాకిస్థాన్.. ముఖం చాటేసిన చైనా.. ఇండియానే దిక్కా?

Update: 2022-08-30 10:30 GMT
పాకిస్థాన్ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో గ‌జ‌గ‌జ‌లాడుతోంది. గ‌త 40 ఏళ్ల‌లో లేనంత స్థాయిలో ఓవైపు వ‌ర్షాలు, మ‌రోవైపు వ‌ర‌ద‌లు ఆ దేశాన్ని చుట్టుముట్టాయి. ఆ దేశంలో స‌గం ప్రాంతాల్లో వ‌ర‌ద ప్ర‌భావం ఉండ‌టం గ‌మ‌నార్హం. దాదాపు 13 కోట్ల మంది ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నారు. ఇప్ప‌టికే 1200 మంది వ‌ర‌ద‌ల‌కు బ‌ల‌య్యారు. వీరిలో 43 మంది చిన్నారులు కూడా ఉన్నార‌ని చెబుతున్నారు.

ఓవైపు వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో పాకిస్థాన్ పూర్తిగా చేతులెత్తేసింది. ప్ర‌పంచ దేశాలు త‌మ‌ను ఆదుకోవాల‌ని విన్న‌పాలు చేసింది. అయితే చైనా.. పాకిస్థాన్ కు అండ‌గా ఉంటామంటూ య‌థాలాపంగా ఓ ప్ర‌క‌ట‌న జారీ చేయ‌డం త‌ప్పా.. ఇప్ప‌టివ‌ర‌కు పావ‌లా సాయం చేసింది లేదు. గ‌ల్ఫ్ కంట్రీస్, తోటి ముస్లిం దేశాలు మాత్ర‌మే పాకిస్థాన్‌కు చేత‌నైన సాయం అందిస్తున్నాయి.

వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దేశంలో స‌గం భూభాగం చిక్కుకోవ‌డంతో పంట‌లు నీట‌మునిగాయి. దీంతో ఆయా ఆహార ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్ప‌టిదాకా ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నంలో శ్రీలంక‌లోనే దారుణ ప‌రిస్థితుల‌ను అంద‌రూ చూడ‌గా.. ఇప్పుడు పాకిస్థాన్ వంతు వ‌చ్చింది. భార‌త్‌లోని పంజాబ్ నుంచి స‌మీప న‌గ‌రం అయిన లాహోర్ న‌గ‌రంలో ట‌మోటా కిలో రూ.500, ఉల్లిపాయ‌లు కిలో రూ.400 ప‌లుకుతున్నాయి. ఒక్క లాహోర్ మాత్ర‌మే కాకుండా ఇస్లామాబాద్ తో స‌హా అనేక పెద్ద న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో ఇలాంటి ప‌రిస్థితే ఉంది. కొన్ని చోట్ల కిలో ట‌మోటాలు రూ.700 ప‌లుకుతున్నాయి. ప్ర‌జ‌లు ఆక‌లితో అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు.

వరదల కారణంగా పంటలు నష్టపోవటం, డిమాండ్ కు తగినట్లుగా సరఫరా లేకపోవటం వల్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ నేప‌థ్యంలో బ‌లూచిస్తాన్, సింధ్, దక్షిణ పంజాబ్‌ల్లో వరదల వల్ల రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయని స‌మాచారం. నిత్యావసరాల్లో ఒకటైన బంగాళదుంపల ధరలు కూడా కిలో రూ.40 నుంచి రూ.120కి పెరిగాయని వార్త‌లు వ‌చ్చాయి.

ఇప్ప‌టికే పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా ప‌త‌నం అంచున ఉంది. సౌదీ అరేబియా, త‌దిత‌ర దేశాలు ఇస్లామిక్ దేశాల ఆర్థిక సాయంతోనే పాకిస్థాన్ నెట్టుకువ‌స్తోంది. ఇప్పుడు పులి మీద పుట్ర‌లా వ‌ర‌ద‌లు, వ‌ర్షాలు విజృంభించ‌డంతో పాకిస్థాన్ బెంబేలెత్తుతోంది. ఇప్పుడు భార‌త్ ఆప‌న్న హ‌స్తం కోసం చూస్తోంది. భార‌త్ కూడా ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో శత్రు భావ‌న చూప‌కుండా చేత‌నైన సాయం చేయ‌డానికి ముందుకొచ్చింది. ఆహార ప‌దార్థాలు, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను పెద్ద మొత్తంలో పంపుతోంది. వాఘా స‌రిహ‌ద్దు గుండా ఇప్ప‌టికే వాహ‌నాలు బ‌య‌లుదేరి వెళ్లాయి.

అలాగే టోర్ఖమ్ సరిహద్దు నుంచి రోజుకు 100 కంటైనర్లు టమోటాలు, 30 కంటెయినర్ల ఉల్లిపాయలు సేకరిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News