పాక్ నీడలో... అనుభవించు దావూద్!

Update: 2015-08-27 02:10 GMT
అనుభవించు రాజా.. పుట్టిందీ, పెరిగిందీ అందుకే... అంటూ ఒక సినీ కవి రాసినట్లు ఉందట ప్రస్తుతం పాక్ లో దావూద్ పరిస్థితి! ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించడంలో ఆరితేరినా పాక్ స్థావరంగా దావూద్ ఇబ్రహీం సకల భోగాలు అనుభవిస్తూ, జల్సా రాయుడిగా ఉంటున్నాడని, ప్రస్తుతం పాక్ ప్రభుత్వం దృష్టిలో అతడు వీవీఐపీ హోదాతో ఉంటున్నాడని తెలుస్తోంది!

ఇప్పటికే కరాచీలో దావూద్ కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్నాడని ఇంటిలిజెన్స్ వర్గాలు బయటపెట్టడం, ఆ విషయాన్ని ఒక జాతీయ ఛానల్ నిర్ధారించడం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా పాక్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ సైతం దావూద్ పాక్ లోనే ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు! భారత్ లోని ప్రముఖ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆరిఫ్ ఈ విషయాలు చెబుతున్నారు!

కరాచీలోని సైనిక గృహంలో, ప్రభుత్వ సెక్యూరిటీ మధ్య ఒక విశాలమైన భవంతిలో దావూద్ ఇబ్రహీం... సకల భోగాలూ అనుభవిస్తున్నాడని, పేరు మార్చుకుని లేడని, ఆ ప్రాంతంలో దావూద్ అంటేనే అక్కడివారంతా గుర్తుపడతారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాక్ ప్రభుత్వ మద్దతు లేకుండా పాక్ లో ఉండటం దావూద్ వల్ల క్షణం కూడా కాదని ఆరిఫ్ స్పష్టం చేస్తున్నారు. భారత్ ను అస్థిరపరచడానికి పాక్ కు ఇప్పుడు దావూద్ అవసరం చాలా ఉందనే అభిప్రాయాన్ని సదరు జర్నలిస్ట్ వ్యక్తపరిచారు! ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఈ విషయాలపై ప్రపంచస్థాయిలో పాక్ పై ఒత్తిడి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!
Tags:    

Similar News