అక్ర‌మిత కాశ్మీర్ పాకిస్థాన్‌ దే అంటున్న ఫ‌రూక్‌

Update: 2015-11-27 12:21 GMT
మీకో ఖ‌రీదైన భ‌వ‌నం ఉంది. దాని మీద ప‌క్కింటోడి క‌న్ను ప‌డింది. మీరు ఊళ్లో లేని రోజు చూసుకొని మీ ఇంటిని క‌బ్జా చేసేశాడు. త‌న‌ద‌ని బోర్డు పెట్టేసుకున్నాడు. మీరేం చేస్తారు? పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టం.. న్యాయ‌పోరాటం చేయ‌టం చేస్తారు. లోగుట్టుగా ఇంకేం చేయాలో కూడా చేస్తారు. అదే స‌మ‌యంలో.. మీ ఇంట్లోని వ్య‌క్తి.. వాడితో గొడ‌వ ఎందుకు? పోయిన ఆస్తి పోతే పోయిందంటే మీరేమంటారు? ఊరుకంటారా? లేక.. పోరాడ‌తారా?

ఇవాళ ఈ ఆస్తిని ఇలానే వ‌దిలేస్తే.. రేపొద్దున్న ఇంకోఆస్తి మీద కూడా అలాంటి దౌర్జ‌న్య‌మే చేస్తే ఏం చేస్తార‌న్న లాజిక్ తో పాటు.. ఊరికే వ‌దిలేస్తే.. అదో అలుసుగా మారుతుంద‌ని మ‌రింత జాగ్ర‌త్త‌గా పోరాడ‌తారు.వ్య‌క్తిగానే ఇంత పోరాటం చేయ‌గ‌లిగిన‌ప్పుడు.. ఒక దేశంలో మ‌రెంతగా పోరాడాలి? అదేం చిత్ర‌మో కానీ.. ఏ దేశంలోనూ క‌నిపించ‌ని ఖ‌ర్మ మ‌న దేశానికి చెందిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల్లో క‌నిపిస్తుంది. పాకిస్థాన్ లాంటి దేశం కాశ్మీర్ ను అక్ర‌మించుకుంటే.. దాని నుంచి త‌న్ని త‌రిమేయాల్సింది పోయి.. అక్ర‌మిత కాశ్మీర్ అని పేరు పెట్టుకొని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాల ద‌గ్గ‌ర పోరాడే ప‌రిస్థితి.

ఇలా పోరాడే దేశాన్ని సైతం వ‌ద్ద‌నే చిత్ర‌మైన మ‌నుషులు రాజ‌కీయ నాయ‌కుల రూపంలో మ‌న దేశంలోనే క‌నిపిస్తుంటారు. ఇలాంటి చిత్ర‌మైన వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా. పాకిస్థాన్ అక్ర‌మిత కాశ్మీర్ పాక్ లో అంత‌ర్భాగంగా ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

కాశ్మీర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం యుద్ధం కాదంటున్న ఆయ‌న‌.. యుద్ధంతో ప్రాణాలు కోల్పోతామ‌ని.. చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ఒక‌దేశ అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌భూభాగాన్ని ఫ‌రూక్ లాంటి చేత‌కాని నేత‌ల కార‌ణంగా దేశం విలువైన భూమిని పోగొట్టుకోవ‌ట‌మే కాదు.. శ‌త్రువును ఇంటి గుమ్మం ముందుకు వ‌చ్చేలా చేసింది. ఇలాంటి వారి విష‌యంలో నోరు విప్పితే దేశంలో అస‌హ‌నం ఎక్కువైందంటూ.. సెల‌బ్రిటీలు గొంతు చించుకోవ‌టం.. దానికి పోలోమంటూ కొంద‌రు ఉదార‌వాదులు మ‌ద్ద‌తుగా నిల‌వ‌టం చూస్తే.. ఇలాంటి చిత్ర‌..విచిత్ర‌మైన ప‌రిస్థితి ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా క‌నిపించ‌దేమో. ఫ‌రూక్ వ్యాఖ్య‌ల్ని బీజేపీ ఖండించింది. మ‌రి.. మిగిలిన పార్టీలు ఏం చెబుతాయో..?
Tags:    

Similar News