భారత్ కొత్త మ్యాపులు..పాక్ కు ఆమోద యోగ్యం కాదట!

Update: 2019-11-03 17:47 GMT
జమ్మూ-  కశ్మీర్ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో భారత్ ఇటీవల విడుదల చేసిన కొత్త మ్యాపులపై దాయాదీ దేశం పాకిస్థాన్ తనదైన శైలి నిరసనను వ్యక్తం చేసింది. భాతర కొత్త మ్యాపులు తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని - తమకే కాకుండా ఐక్యరాజ్యసమితికి కూడా ఆమోదయోగ్యం కాదంటూ పాక్ ఓ వితండ వాదనను తెరమీదకు తెచ్చేసింది. తమకు మాత్రమే ఆమోదయోగ్యం కాదంటే... ఎక్కడ ఐక్యరాజ్యసమితి కలగజేసుకుంటుందని భావించిందో? ఏమో? తెలియదు గానీ.. పాక్ తన అభ్యంతరాలకు ఐరాస కూడా వత్తాసు పలకడం ఖాయమన్న కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చింది.

ఈ కథాకమామీషు పూర్తి వివరాల్లోకి వెళితే... జమ్మూ - కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ శనివారం (అక్టోబర్ 31న) భారతదేశ నూతన మ్యాప్‌ లను విడుదల చేసింది. జమ్మూ - కశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 రూపంలో ఉన్న స్వయం ప్రతిపత్తిని పార్లమెంటు ఉపసంహరించడం, దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం తెలిసిందే. అలాగే - జమ్మూ - కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా రాష్ట్రపతి ఆమోదించారు. ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ 31వ తేదీ నుంచి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం విడిపోయి.. జమ్మూ - కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం - లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం అమల్లోకి వచ్చాయి. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో రెండు జిల్లాలు.. కార్గిల్ - లేహ్ ఉన్నాయి. పాత జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతం అంతా జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోకి వచ్చింది.

కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు.. 1947వ సంవత్సరంలో జమ్మూ - కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు.. కథువా  జమ్మూ - ఉదంపూర్ - రేయాసి - అనంత నాగ్ - బారాముల్లా - పూంచ్ - మీర్పూర్ - ముజఫరాబాద్ - లేహ్ - లద్దాఖ్ - గిల్గిత్ - గిల్గిత్ వజరత్ - చిల్హస్‌-గిరిజన ప్రాంతం ఉండేవి. జమ్మూ - కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం వీటిని 28 జిల్లాలు చేసింది. 2019 నాటికి కొత్త జిల్లాలు.. కుప్వారా - బందిపూర్ - గన్ దెర్బల్ - శ్రీనగర్ - బుడ్గాం - పుల్వామా - షుపియాన్ - కుల్గాం - రాజౌరి - రాంబన్ - దోడ - కిష్టివర్ - సాంబ - కార్గిల్ కూడా మనుగడలో ఉన్నాయి. వీటిలో కార్గిల్ జిల్లాను లేహ్ - లదాఖ్ జిల్లా నుంచి విడగొట్టి ఏర్పాటు చేశారు. ఇప్పుడు కార్గిల్ జిల్లా ఏర్పాటు తర్వాత మిగిలిన లేహ్ జిల్లాలో.. గిల్గిత్ - గిల్గిత్ వజరత్ - చిల్హస్-గిరిజన ప్రాంతాన్ని కూడా కలుపుతున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఈ మేరకు జమ్మూ - కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం - లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం మ్యాప్‌ లను సర్వే జనరల్ ఆఫ్ ఇండియా తయారు చేశారు.

ఈ కొత్త మ్యాపులపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్థాన్..., వాటిని తిరస్కరిస్తున్నామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో పాకిస్థాన్ ఏ తరహా వాదన చేసిందన్న విషయానికి వస్తే... ‘‘నవంబర్ 2న భారత హోంశాఖ విడుదల చేసిన రాజకీయ మ్యాపులలో గిల్గిత్-బాల్టిస్తాన్ - అజాద్ జమ్మూ - కశ్మీర్‌ లను భారత్‌ లో అంతర్భాగంగా చూపించడం సరికాదు, చట్టప్రకారం ఆమోదనీయం కాదు. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘనే అవుతుంది. పాకిస్తాన్ ఈ మ్యాపులను తిరస్కరిస్తోంది. ఇవి ఐక్యరాజ్య సమితి మ్యాపులకు అనుగుణంగా లేవు. భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యా కూడా ఐరాస పేర్కొన్న జమ్మూ - కశ్మీర్‌ పై ఉన్న 'వివాదాస్పద భూభాగం' ముద్రను మార్చలేవని మేం మరోసారి స్పష్టం చేస్తున్నాం. భారత పాలనలో ఉన్న జమ్ము - కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కుకు భారత ప్రభుత్వం తీసుకునే ఇలాంటి చర్యలు విఘాతం కలిగించలేవు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా స్వయం నిర్ణయాధికార హక్కును వినియోగించుకునేందుకు, భారత పాలనలో ఉన్న జమ్ము, కశ్మీర్ ప్రజల న్యాయబద్ధమైన పోరాటానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగుతుంది"అని పాకిస్థాన్ ఆ ప్రకటనలో పేర్కొంది.

   

Tags:    

Similar News