ఆ విష‌యంలో పాక్ బెట‌ర్‌.. మోడీ జీ! మీరూ కొంత రియాక్ట్ అవ్వాలి!

Update: 2022-06-25 02:30 GMT
సాధార‌ణంగా దాయాది దేశం పాకిస్థాన్ అంటే.. చాలా మంది మండిప‌డుతుంటారు. భార‌త్‌పై యుద్ధానికి కాలుదువ్వుతుంద‌ని, అన‌వ‌స‌రంగా రెచ్చ‌గొడుతుంద‌ని.. అంటారు. ఇది నిజ‌మే. కానీ, కొన్ని కొన్ని విష‌యాల్లో పాకిస్థాన్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను మ‌న వాళ్లు కూడా ప్ర‌శంసిస్తున్నారు.  తాజాగా ఆ దేశం ఆర్థికంగా నిల‌దొక్కుకునేందుకు తీసుకున్న నిర్ణ‌యం.. భార‌త్‌లోనూ అమ‌లు చేయాల‌ని.. ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ``ఆ విష‌యంలో పాక్ బెట‌ర్ మోడీ జీ!`` అనే కామెంట్లు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ పాకిస్తాన్‌లో ఏం జ‌రిగిందంటే..  ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న  పాకిస్థాన్ ప్రభుత్వం.. త‌న‌ పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు సంప‌న్నుల‌పై అద‌న‌పు సుంకాలు వ‌డ్డించింది.  తాజాగా భారీ పరిశ్రమలు, సంపన్నులపై పన్ను పిడుగు వేసింది. దేశం ఆర్థికంగా పుంజుకోవాలంటే అందరూ సహకరించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కొరత మొదలైన సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ ఆర్థిక స్థితిని మెరుపర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ క్ర‌మంలో తాజాగా భారీ స్థాయి పరిశ్రమలు, దేశంలోని సంపన్నులపై పన్నుభారం మోపింది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై సమావేశం నిర్వహించిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వివరాలు వెల్లడించారు. `సూపర్‌టాక్స్` పేరిట 10శాతం పన్నును ప్రకటించారు. సిమెంట్, ఉక్కు, చక్కెర, చమురు, గ్యాస్, ఎల్ఎన్జి టెర్మినల్స్, ఎరువులు, టెక్స్‌టైల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్, సిగరెట్లు, పానీయాలు రసాయనాలు వంటి రంగాలు.. 10 శాతం పన్ను కట్టాల్సిందేన‌న్నారు.

ద్రవ్యోల్బణం నుంచి బయటపడటం, నగదు కొరతతో ఉన్న దేశాన్ని దివాలా తీయకుండా కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. అధిక ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడం, ప్రజలపై ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించి, సౌకర్యాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. దేశం దివాలా తీయకుండా కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ``పాకిస్తాన్‌ ఆర్థికంగా కోలుకునేందుకు ధనికులు కూడా పేదరిక నిర్మూలన పన్ను కట్టాల్సి ఉంటుంది``అని షరీఫ్‌ తెలిపారు.

పాకిస్థాన్ కరెన్సీలో వార్షిక ఆదాయం 15 కోట్ల రూపాయలు దాటిన వారు ఒకశాతం, 20 కోట్లు దాటితే 2 శాతం పన్ను విధిస్తామన్నారు. 25 కోట్లు దాటిన వారు 3శాతం, 30 కోట్లకుపైగా వార్షిక ఆదాయం ఉన్న వారు 4శాతం పన్నుకట్టాల్సి ఉంటుందన్నారు. బడ్జెట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పన్నుల వసూళ్లకు బృందాలను ఏర్పాటు చేస్తామని షరీఫ్ చెప్పారు.

మ‌న ద‌గ్గ‌ర ఏం జ‌రుగుతోంది!

భార‌త్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భుత్వానికి ఏ క‌ష్టం వ‌చ్చినా.. న‌ష్టం వ‌చ్చినా.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌పైనే భారాలు వేసేస్తోంది. పెట్రోల్ ధ‌ర‌లు పెంచేస్తోంది. ప‌న్నుల మోత మోగిస్తోంది. తాజాగా బ్యాంకు రుణాల వ‌డ్డీల‌ను హైలెవిల్‌కు తీసుకువెళ్లింది. కానీ, సంపన్న వ‌ర్గాల‌పై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప‌న్నులు విధించ‌క‌పోగా.. వారికి ఇస్తున్న కార్పొరేట్ రాయితీల‌ను ఇటీవ‌ల పెంచుకుంటూ వెళ్లింది. ఈ నేప‌థ్యంలోనే సామాన్యులు.. పాక్ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. మోడీ జీ మీరు కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోండి! అని కోరుతున్నారు.
Tags:    

Similar News