అభినంద‌న్ జెనీవా ఒప్పందం కింద‌కు వ‌స్తారా?

Update: 2019-02-28 04:52 GMT
భార‌త గ‌గ‌న‌త‌లంలోకి పాక్ జెట్ ఫైట‌ర్స్ దూసుకురావ‌టం.. భార‌త్ లోని ఆయుధ‌గారాల్ని ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేయాల‌న్న ప్లాన్ తో వ‌చ్చిన పాక్ యుద్ధ విమానాల్ని త‌రిమికొట్టే బాధ్య‌తాయుత‌మైన ప‌నిని చేప‌ట్టారు వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ద‌న్‌.

ఆ క్ర‌మంలో పాక్ భూభాగంలోకి ఆయ‌న వెళ్లారు.అదే స‌మ‌యంలో ఆయ‌న యుద్ధ విమానాన్ని పాక్ కూల్చింది.  కూలిపోతున్న విమానం నుంచి త‌ప్పించుకున్న అభినంద‌న్ దుర‌దృష్ట‌వ‌శాత్తు పాక్ భూభాగంలో చిక్కుకుపోయారు. ప్ర‌స్తుతం పాక్ ఆర్మీ నిర్బందంలో ఉన్న అభినంద‌న్ యుద్ధ ఖైదీ కింద‌కు వ‌స్తారా? అన్న‌ది చ‌ర్చ‌గా మారింది.

అయితే.. దీనిపై భార‌త్‌.. పాక్ లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

 పాక్ కు ప‌ట్టుబ‌డ్డ  అభినంద‌న్ యుద్ధ ఖైదీ అని.. ఎందుకంటే భార‌త్ లోని సైనిక స్థావరాల‌పై దాడి చేసే ప్ర‌య‌త్నం చేసిన పాక్ యుద్ధ విమానాల్ని వెంబ‌డించి ప‌ట్టుబ‌డ‌టం క‌చ్ఛితంగా సంగ్రామం కింద‌నే వ‌స్తుంది. కానీ.. పాక్ మాత్రం ఇందుకు భిన్నంగా వాద‌న‌లు వినిపిస్తుంది.

తాజాగా జ‌రుగుతున్న‌ది సాయుధ సంగ్రామం కాద‌ని.. అదో ఘ‌ర్ష‌ణగా పాక్ చెబుతోంది.  బుధ‌వారం జ‌రిగింది గ‌గ‌న‌త‌ల ఘ‌ర్ష‌ణ మాత్ర‌మేన‌ని.. సైనిక స్థావ‌రాల మీద దాడిగా వారు వితండ వాదం వినిపిస్తున్నారు. భార‌త గ‌గ‌న‌త‌లంలో పాక్ యుద్ధ విమానాలు రావ‌టాన్ని వారు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌టం లేదు. ఈ విష‌యాన్ని నిరూపించ‌టం ద్వారా.. పాక్ తో జ‌రిగింది గ‌గ‌న‌త‌ల ఘ‌ర్ష‌ణ కాదు.. సైనిక స్థావ‌రాల మీద దాడిగా స్ప‌ష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

పాక్ వాద‌న‌ను భార‌త్ ఒప్పుకోవ‌టం లేదు. సాయుధ బ‌ల‌గాలు పాల్గొనే ఏ ఘ‌ర్ష‌ణ అయినా  సాయుధ సంగ్రామం కింద‌కే వ‌స్తుంద‌ని చెబుతోంది. ధ‌ర్మ‌ప్ర‌కారం చూస్తే.. పాక్ వ‌ద్ద ఉన్న అభినంద‌న్ యుద్ధ ఖైదీగా ట్రీట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అలాచేయ‌టం పాక్ కు ఇష్టం లేదు. ఈ కార‌ణంతోనే తొండి వాద‌న‌ను వినిపించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

జెనీవా ఒప్పందం ఏంటీ...?

రెండో ప్రపంచ యుద్దం తర్వాత 196 దేశాలు జెనీవా ఒప్పందంకు సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం గాయపడి శత్రుదేశానికి చిక్కిన సైనికులను హింసించకుండా వారికి సరైన చికిత్స అందించి - వారిని సురక్షితంగా తిరిగి సొంత దేశానికి పంపించాలి. ఇలా దొరికిన వారికి మరణ శిక్షను విధించడం చేయరాదు. ఇంకా ఈ ఒప్పందం ప్రకారం శత్రు దేశానికి చెందిన సైనికులు చిక్కిన సమయంలో వారికి సంబంధించిన పేరు - ఆర్మీలో వారి ర్యాంకు - నెంబర్‌ ను మాత్రమే తెలుసుకోవాలి. అలా కాదని సైన్యం రహస్యాలు చెప్పాలని - ఇంకా ఇతర విషయాలు చెప్పాలని శారీరకంగా - మానసికంగా వేదించకూడదు.

ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ తూచా తప్పకుండా పాటిస్తుందని అయితే భావించడం లేదు. ఖచ్చితంగా సైన్యంకు సంబంధించిన రహస్యాలను తెలుసుకునేందుకు అభినందన్‌ ను హింసించే అవకాశం ఉంది. అతడి ప్రాణాలు తీయకున్నా హింసించి తెలుసుకుంటుందని మాజీ సైనిక అధికారులు చెబుతున్నారు. అభినందన్‌ మనో ధైర్యంతో మళ్లీ మన గడ్డపై అడుగు పెడతాడని అంతా విశ్వసిస్తున్నారు. కేరళకు చెందిన అభినందన్‌ ను విడిపించేందుకు కేంద్రం కూడా సీరియస్‌ గా ప్రయత్నాలు చేస్తోంది.
Tags:    

Similar News