పాల‌కుల‌ను ఛీ కొడుతున్న పాకిస్తానీలు!

Update: 2017-05-20 04:31 GMT
గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ భారత నౌకాదళం మాజీ అధికారి అయిన కులభూషణ్ జాధవ్ కేసు విషయంలో పాక్ పాలకుల వైఖరి కారణంగానే అంతర్జాతీయ న్యాయస్థానం ముందు దేశం పరువు పోయిందని ఆ దేశంలోని న్యాయ నిపుణులతో పాటుగా సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్నారు. జాధవ్‌ కు పాక్ మిలిటరీ న్యాయ స్థానం ఇటీవల విధించిన మరణ శిక్ష అమలును తుది తీర్పు వెలువడే దాకా నిలిపివేయాలని హేగ్‌ లోని అంతర్జాతీయ న్యాయస్థానం గురువారం పాక్‌ ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో ఈ వ్యవహారం విషయంలో విదేశాంగ శాఖ వ్యవహరించిన తీరుపైన, అలాగే అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ తరఫున వాదనలు వినిపించడానికి ఖవర్ ఖురేషిని ఎంచుకోవడంపైన కూడా న్యాయ నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా, జాధవ్ కేసును ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా చేయడానికి బదులు అందరూ కలిసి కూర్చుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటే బాగుంటుందని ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల ఉద్యమ నాయకురాలు ఆస్మా జహంగీర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు జాధవ్‌కు ఇక్కడే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి ఉంటే సమస్య ఇంతదాకా వచ్చి ఉండేది కాదని కూడా ఆమె అభిప్రాయ పడ్డారు. ‘జాధవ్‌ ను భారత దౌత్య అధికారులు కలుసుకొనేందుకు అనుమతి ఇవ్వవద్దని ఎవరు సలహా ఇచ్చారు?’ అని కూడా ఆమె ప్రశ్నించారు. జాధవ్‌ ను తమ దౌత్య అధికారులు కలవడానికి అవకాశం కల్పించాలని భారత్ దాదాపు 16 సార్లు పాక్‌ను కోరిన విషయం తెలిసిందే. భారత జైళ్లలో అనేక మంది పాకిస్తానీలు మగ్గుతున్నారని ఆమె గుర్తు చేస్తూ వారందరి విషయంలో పాక్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగలదా? అని కూడా ఆస్మా జహంగీర్ ప్రశ్నించినట్లు ‘డాన్’ పత్రిక పేర్కొంది.

సైనిక వ్యవస్థకు-రాజకీయ వ్యవస్థ మధ్య అదికార పోరాటం, అలాగే విదేశాంగ విధానం - జాతీయ భద్రత దృష్టి కోణాల మధ్య అంతరం ఎంతగా పెరిగి పోయాయనే దానికి జాధవ్ కేసు ఒక చక్కటి నిదర్శనమని పాక్ బార్ కౌన్సిల్ సభ్యుడు రహీల్ కమ్రాన్ షేక్ అభిప్రాయ పడ్డారు. జరిగింది జరిగిపోయిందని, ఇక రెండో దశ విషయంలోనైనా పాక్ ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉండాలని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీజెలో పాక్ ప్రభుత్వం తరఫున కేసు వాదించడానికి కొత్త న్యాయవాదుల బృందాన్ని ఎంపిక చేయనున్నట్లు ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారయిన సర్తార్ అజీజ్ ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News