సెల్వంకు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ప‌ళ‌నిస్వామి

Update: 2017-05-20 13:02 GMT
త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వ‌ర్గాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటివ‌ర‌కు అన్నాడీఎంకేలోని అంత‌ర్గ‌త ప‌రిణామాల‌పైనే ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య విమ‌ర్శ‌లు నెల‌కొనగా తాజాగా రాజ‌కీయ జీవితంవైపు ఆ విమ‌ర్శ‌లు మ‌ర‌లాయి. మాజీ సీఎం ప‌న్నీర్ వ‌ర్గానికి చెందిన నేత‌లు ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ ప‌న్నీర్ సెల్వం కార‌ణంగానే ప‌ళ‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చినట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ పన్నీర్‌ వర్గం వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అన్నాడీఎంకేలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుత స్థాయికి చేరుకున్నానని ముఖ్యమంత్రి  పళనిస్వామి స్ప‌ష్టం చేశారు.

తాను 1974లో ప్రజా జీవితంలోకి వచ్చానని ప‌ళ‌నిస్వామి వివ‌రించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీలో పలు పదవులు అలంకరించానని, 1985లో జయలలిత పేరవై ఏర్పాటు చేసి ‘అమ్మ’ మనసులో చోటు సంపాదించానని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ తదితర పదవులు చేపట్టిన తనను అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత ఎంత‌గానో ప్రోత్సహించార‌ని తెలిపారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తన మంత్రివర్గంలో ప్రజాపనులశాఖ, రహదారులశాఖ మంత్రిగా నియమించారని గుర్తు చేశారు. ఎంజీఆర్‌, జయలలిత మార్గదర్శకాల మేరకు రాజకీయాల్లో తాను ఎదిగానని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమ్మ‌ జయలలిత మార్గంలో పయనిస్తుందని ప‌ళ‌ని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News