త‌మిళ పాలిటిక్స్!... ప్రిడిక్ష‌న్ క‌ష్ట‌మే సుమీ!

Update: 2017-09-04 05:38 GMT
అర‌వోళ్ల గోల ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ రోజు పైచేయి సాధించిన వారి ప‌రిస్థితి రేపు ఎలా ఉంటుంద‌నే విష‌యం రాజ‌కీయాల్లో త‌ల‌లు పండిన నేత‌ల‌కే అర్థం కాని ప‌రిస్థితి అక్క‌డ నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌మిళ తంబీలు అమ్మగా పిలుచుకునే దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం ఒక్క‌సారిగా మారిపోయిన త‌మిళ‌నాడు రాజ‌కీయాలు... రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. అమ్మ న‌మ్మిన‌బంటు ఓ ప‌న్నీర్ సెల్వంను సీఎం ప‌ద‌వి నుంచి దించేసిన జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌... త‌నకు న‌మ్మిన బంటుగా ఉన్న ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామికి పీఠ‌మెక్కించింది. ఈ క్ర‌మంలో నిన్న‌టిదాకా బ‌ద్ధ శ‌త్రువులుగా మెల‌గిన ఓపీఎస్‌ - ఈపీఎస్‌... ఇప్పుడు ఒక్క‌టైపోయి శ‌శిక‌ళ‌కు పెద్ద షాకే ఇచ్చారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత టైం బాగోలేక జైలుకెళ్లిన శ‌శిక‌ళ‌ - ఆమె మేన‌ల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్‌ ల‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించేసిన ఓపీఎస్‌ - ఈపీఎస్‌ లు ఇప్పుడు పార్టీతో పాటు పాల‌నా ప‌గ్గాల‌ను త‌మ అదుపులోకి తీసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయితే వారిద్ద‌రికీ షాకిచ్చేలా అన్నాడీఎంకేకు చెందిన 22 మంది ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకున్న దిన‌క‌ర‌న్‌... అస‌లు ప‌ళ‌నిసామి ప్ర‌భుత్వానికి మెజారిటీ ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌ళ‌ని స‌ర్కారుకు ద‌మ్ముంటే బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ధం కావాల‌ని, లేదంటే గ‌వ‌ర్న‌రే బ‌ల ప‌రీక్ష‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. దిన‌క‌ర‌న్ నుంచి ఊహించ‌ని ఈ ఎదురు దెబ్బ‌కు నాలుగైదు రోజులు విల‌విల్లాడిన ప‌ళనిసామి... ఇప్పుడు మ‌రో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. సిద్ధం చేయ‌డ‌మే కాదండోయ్‌... ఏకంగా స‌ద‌రు అస్త్రంతో ఏకంగా దిన‌క‌ర‌న్‌ కు దిమ్మ తిరిగేలా గ‌ట్టి దెబ్బే కొట్టారు. ఈ దెబ్బ‌కు విలవిల్లాడిపోయిన దిన‌క‌ర‌న్‌... త‌న మ‌కాంను పుదుచ్చేరి నుంచి మ‌న భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాదుకు మార్చేయాల్సి వ‌చ్చింద‌ట.

ప‌ళని కొట్టిన దెబ్బ‌... దిన‌క‌ర‌న్ తీసుకున్న నిర్ణ‌యం విష‌యానికి వ‌స్తే.... అన్నాడీఎంకేకు చెందిన 22 మంది ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపున‌కు తిప్పేసుకున్న దిన‌క‌ర‌న్ వారిని పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌ లో ఏర్పాటు చేసిన క్యాంపున‌కు త‌ర‌లించారు. అయితే ఎలాగోలా స‌ద‌రు క్యాంపులోని గుట్టును చేధించిన ప‌ళ‌ని... ఆ 22 మంది ఎమ్మెల్యేల్లోని ఐదుగురికి గాలమేశార‌ట‌. ప‌ళ‌ని వేసిన ఈ గాలానికి చిక్కిపోయిన స‌ద‌రు ఐదుగురు ఎమ్మెల్యేలు దిన‌క‌ర‌న్ దానిని గ్ర‌హించేలోగానే పుదుచ్చేరి క్యాంపు నుంచి జంప్ కొట్టార‌ట‌. దీంతో షాక్ తిన్న దిన‌క‌ర‌న్‌... త‌మిళ‌నాడుతో క‌లిసిపోయిన పుదుచ్చేరిలో ఇంకా క్యాంపు కొన‌సాగిస్తే... మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న కోణంలో ఆలోచించి త‌న క్యాంపును ఉన్న‌ప‌ళంగా హైద‌రాబాదు త‌ర‌లించార‌ట‌. మ‌రి హైద‌రాబాదు క్యాంపుపై ప‌ళ‌నిసామి ఎలాంటి దెబ్బ కొడ‌తారోన‌న్న అంశంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.
Tags:    

Similar News