పల్లా రాజేశ్వరరెడ్డికి పొగ పెడుతున్నారా?

Update: 2019-11-02 10:10 GMT
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ విజయం కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగిన నాయకుల్లో మొదట చెప్పుకోవాల్సిన పేర్లలో పల్లా రాజేశ్వరరెడ్డి పేరొకటి. హుజూర్ నగర్ అభ్యర్థితో పాటు రాజేశ్వరరెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం భారీగా ఖర్చు చేశారని టాక్. టీఆర్‌ఎస్‌ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా ఉన్న ఆయన పార్టీ అధినేత కేసీఆర్ సన్నిహితుల్లో ఒకరు. అయినా, ఇటీవల పార్టీలో కొన్ని పరిణామాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయట. ఇవేమీ కాకతాళీయంగా జరుగుతున్నవి కావని.. ఆయనకు పొగ పెట్టే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్నవని వినిపిస్తోంది.

కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న ఓ మంత్రి రాజేశ్వరరెడ్డిని టార్గెట్ చేశారని.. ఆయనకు చెక్‌ పెట్టేలా పావులు కదుపుతున్నారని నల్గొండ టీఆరెస్‌లో వినిపిస్తోంది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయాలని కోదాడ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అనూహ్య పరిణామాల్లో భాగంగా టీడీపీ టికెట్‌ దక్కని బొల్లం మల్లయ్య యాదవ్‌ను సదరు మంత్రి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి పార్టీ టికెట్‌ ఇప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పల్లా మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అది కూడా చేతికందలేదు.

మరోవైపు ఇటీవల మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో పరిశ్రమల హబ్‌ ప్రారంభానికి కూడా ఆయన్ను ఆహ్వానించలేదు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు ఆహ్వానం రాకపోవడం, శిలాపలకంపై ఆయన పేరు లేకపోవడం పార్టీలోనూ చర్చనీయమైంది.

2018 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతను ఓ మంత్రికి పార్టీ అప్పగించింది. కానీ, ఆయన అక్కడ అభ్యర్థిని గెలిపించడంలో ఫెయిలయ్యారు. అయితే, అదే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పార్టీ మంత్రిని కాదని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ ఎన్నికలో ఆయన పార్టీ అభ్యర్థిని రికార్డుస్థాయి మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టారు. దీంతో పల్లాకు పార్టీలో ఎక్కడ తనకంటే ఎక్కువ పేరొస్తుందో అనే అనుమానంతో అతడిని దూరం పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లాకు కేసీఆర్ వద్ద పట్టుండడంతో మంత్రిగారు కంగారుపడుతున్నారట. ఆ క్రమంలోనే పల్లాకు చెక్ పెట్టే ప్రయత్నాలు ఆయన వేగవంతం చేస్తున్నట్లు వినిపిస్తోంది.
Tags:    

Similar News