అమ్మ పార్టీపై మోడీ ఆశ ఇదే

Update: 2017-06-15 09:21 GMT
అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత చీలిక‌లు పీలిక‌లుగా మారిన అన్నాడీఎంకేపై ఢిల్లీలో ఏం చ‌ర్చ జ‌రుగుతోంది? ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ త‌మిళుల రాజ‌కీయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇలాంటి అభిప్రాయాల‌కు మాజీ ముఖ్యమంత్రి ప‌న్నీర్ సెల్వం ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడిన సెల్వం రాజ‌కీయాలు - అన్నాడీఎంకే ప‌రిణామాల గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం అనంత‌రం గ్రూపులుగా చీలిపోయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యమంత్రి కె పళనిస్వామి ఒక‌వ‌ర్గానికి నాయ‌క‌త్వం - అన్నాడీఎంకె రెబల్‌ నేత - మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం మ‌రోవ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండు వర్గాలు ఐక్యమత్యంతో పనిచేయాలని భావించి ఇందుకోసం త‌న వ‌ర్గం నేత‌ల‌తో ఒక క‌మిటీని సెల్వం ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ లో ఏర్ప‌డిన ఈ క‌మిటీని రద్దుచేస్తున్నట్టు సెల్వం ఇటీవ‌లే ప్రకటించారు. ఇలా ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా  ప‌రిణామం గురించి సెల్వం వివ‌ర‌ణ ఇస్తూ ‘రెండు వర్గాలు కలిసి పనిచేయాలన్న అభిప్రాయంతో ప్రజలూ ఏకీభవించడంలేదు. గతంలో మా మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దుచేసుకున్నాం’ అని పన్నీర్‌ సెల్వం ప్రకటించారు. రెండు వర్గాలు కలిసి పనిచేసే వాతావరణాన్ని పళని శిబిరం దెబ్బతీసిందని ఆయన ప‌న్నీర్ సెల్వం ఆరోపించారు. తాము ప‌ళ‌ని టీం వ‌లే వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని అందుకే విలీనం ప్ర‌క్రియ నిలిచిపోయింద‌ని తెలిపారు.

అన్నాడీఎంకే చీలిక విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సైతం త‌న భావాల‌ను త‌న‌తో పంచుకున్నార‌ని సెల్వం వివ‌రించారు. తాను ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడీఎంకే ముందుకు సాగాలని, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారని సెల్వం స‌ద‌రు ఇంట‌ర్వ్యూలో వివరించారు. అన్నాడీఎంకే ఒకే వేదికగా సాగాలని మోడీ ఆశ పడ్డారని, ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి కార్య‌క‌ర్తలు త‌న వైపు ఉన్నారని సెల్వం వెల్ల‌డించారు. ఎమ్మెల్యేల‌కు ముడుపుల వ్య‌వ‌హారంలో త‌న‌వైపు ఉన్న‌వారు ఎవ‌రూ లేర‌న్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీపై స్పందిస్తూ రాజ‌కీయాల్లోకి ఎవ‌రైనా రావ‌చ్చ‌ని, అయితే ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో నాయ‌కుడిగా నిల‌దొక్కుకోవాల‌ని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News