నొప్పి ఫోటో లేన‌ప్పుడు తెలుస్తుంది బుచ్చ‌య్య‌!

Update: 2017-11-20 05:20 GMT
అంతా బాగున్న‌ప్పుడు ఎన్ని మాట‌లైనా చెబుతారు. లెక్క తేడా వ‌చ్చిన‌ప్పుడే అప్ప‌టివ‌ర‌కూ చెప్పిన నీతుల‌న్ని గాలికి ఎగిరిపోతాయ్‌. తాజాగా ఏపీ టీడీపీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వ్య‌వ‌హారం ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మం వేదిక‌గా ఏపీలో కొన్ని చోట్ల పార్టీ అంత‌ర్గ‌త విభేదాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో గ్రూపు త‌గాదాలు మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మం ఫ్లెక్సీలో న‌గ‌ర మేయ‌ర్ పంతం ర‌జ‌నీశేష‌సాయి ఫోటో లేక‌పోవ‌టం క‌ల‌క‌లం రేగింది. దీంతో.. ముగింపు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పంతం.. త‌న ఫోటో లేక‌పోవ‌టాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. నేనుపార్టీలోనే ఉన్నానా?  లేనా? అర్థం కావ‌టం లేదంటూ అని వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నంగా మారింది. వేదిక మీద కానీ.. వేదిక చుట్టుప‌క్క‌ల కానీ ఏర్పాటు చేసిన బ్యాన‌ర్లు.. ఫ్లెక్సీల్లో త‌న ఫోటో లేక‌పోవ‌టాన్ని ప్ర‌శ్నించారు.

దీంతో.. ఇరుకున ప‌డిన నేత‌లు.. మేయ‌ర్ మాట‌ల్ని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మాట్లాడుతూ.. పొర‌పాటుతో ఫోటో వేయ‌క‌పోవ‌చ్చు.. పెద్ద‌గా ప‌ట్టించుకోకూడ‌దు.. మేయ‌ర్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రంటూ చేసిన వ్యాఖ్య‌లు మేయ‌ర్ వ‌ర్గాన్ని మంట పుట్టిస్తున్నాయి. పొరపాటు అంటే ఏదో ఒక చోట ఫోటో లేక‌పోవ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చ‌ని.. ఎందులోనూ ఫోటో లేక‌పోవ‌టం దేనికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డుతున్నారు. జ‌రిగిన త‌ప్పును క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసిన గోరంట్ల మీదా మేయ‌ర్ వ‌ర్గీయులు ఫైర్ అవుతూ... బుచ్చ‌య్య ఫోటో లేకుండా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తే కానీ నొప్పి తెలీదంటున్నారు. త‌న దాకా వ‌స్తే కానీ.. విష‌యం అర్థం కాద‌న్న‌ది అంద‌రికి తెలిసిందేగా.
Tags:    

Similar News