జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాక సందర్భంగా ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో ఆయనకు అల్పాహార విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా వంటల వద్ద కనిపించే మంత్రి సునీతమ్మ పవన్ రాక సందర్భంగానూ వంటలపై దృష్టిపెట్టారట. ఆమె దగ్గరుండి మరీ పవన్ కోసం పలు వంటకాలను చేయించినట్లు తెలుస్తోంది.
పవన్ కోసం... ఇడ్లీ, వడ, దిబ్బరొట్టెలతో పాటు రాగి సంకటి, పొంగల్ తయారు చేయించారు. వీటితో పాటు చట్నీ - సాంబార్ - కారంపొడి - నెయ్యి తదితరాలను సిద్ధం చేశారు. అల్పాహారం స్వీకరిస్తూనే పరిటాల సునీతతో పవన్ పలు విషయాలను చర్చించినట్టు జనసేన వర్గాలు తెలిపాయి.
కాగా అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్.. హంద్రీనీవా నీటితో అన్ని చెరువులను నింపే విషయమై అధికారులతో మాట్లాడుతానన్నారు. తన పార్టీ ప్రజాభీష్టం మేరకే ముందుకు సాగుతుందని... ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి మాట్లాడతానని పవన్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబుతో సహా ఎవరితోనూ విభేదాలు తనకు లేవని, చెప్పారు. నూతన అమరావతిలో తమ పాత్ర లేకుండా పోయిందని రాయలసీమ వాసులు భావిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఆ ప్రాంతానికి కనెక్టివిటీ కూడా సరిగ్గా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వెల్లడించిన పవన్, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. అందరూ కలసి వస్తేనే అనంత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.