బ్యాంకు 'క్యూ'లకు కూలీలు రెఢీ అయిపోయారు

Update: 2016-11-23 01:58 GMT
అవసరం మనిషికి సరికొత్త ఐడియాల్ని ఇస్తుంది. అవసరానికి సాయంగా నిలవాలన్న దిశగా కొందరుఆలోచిస్తే.. మరికొందరు అందులో దాన్నో వ్యాపార అవకాశంగా ఎలా మలుచుకోవాలన్నది చూస్తారు. తాజాగా అలాంటి ఆసక్తికర ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో  బ్యాంకుల వద్దా.. ఏటీఎం సెంటర్ల వద్ద భారీ క్యూలు చోటు చేసుకున్నాయి. ప్రధాని తన నిర్ణయాన్ని వెల్లడించి 14 రోజులు అవుతున్నా.. ఇప్పటివరకూ క్యూ బారులు తగ్గుతున్నది కనిపించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇలాంటి సమస్యల్ని తీర్చేందుకు తాజాగా ఒక ఆన్ లైన్ సేవలు అందుబుటులోకి వచ్చాయి.

అదేమంటే.. బ్యాంకు సేవల్ని వినియోగించటం కోసం క్యూలలో గంటల తరబడి నిలుచునే ఇబ్బంది లేకుండా.. గంటల చొప్పున క్యూలో నిలుచోవటానికి కూలీల్ని తాము సరఫరా చేస్తామని ముందుకొచ్చిందో సంస్థ. ‘‘బుక్ మై చోటు. కామ్’’ పేరిట గంటకు రూ.90చొప్పున అద్దెకు తీసుకుంటే చాలు.. అలా అద్దెకు తీసుకున్న వ్యక్తి తరపున బ్యాంకు బయట క్యూలో నిలచుంటారు. అయితే.. వారు బ్యాంకు లోపలకు మాత్రం వెళ్లరు.

బ్యాంకు బయటే తమ సేవల్ని అందిస్తారు. బ్యాంకు లోపలకు వెళ్లే సమయానికి సదరు కూలీ తాను నిలుచున్న ప్లేస్ ని సదరు వ్యక్తికి ఇచ్చేస్తారు. ప్రస్తుతానికి ఈ సేవల్ని ఉత్తరప్రదేశ్.. హర్యానా.. ఢిల్లీల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యూలో నిలుచోవటానికి సహాయకుడు అవసరమైతే ఆన్ లైన్లో రిజిష్టర్ అవ్వొచ్చు. లేదంటే.. 8587028869 నెంబరుకు కాల్ చేయాల్సి ఉంటుందని సదరుసంస్థ చెబుతోంది. ఇక..తమ కంపెనీలో ‘చోటూ’ అన్న పేరున్నప్పటికీ.. పనులకోసం నియమితులైన వారంతా 18ఏళ్లకు పైబడినవారేనని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ స్టార్టప్ కంపెనీని సత్ జీత్ సింగ్ బేడీ.. గోవిన్ కంధారి అనే ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వెబ్ సైట్ ద్వారానే సేవలు అందిస్తున్నఈ సంస్థ.. త్వరలో అండ్రాయిడ్ యాప్ ను కూడా రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఏటీఎం.. బ్యాంకుల వద్ద క్యూల కోసమే కాదు.. ఇళ్లు మారే సమయంలో.. ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నా.. సరుకులు తెచ్చుకోవాలన్నా.. హెల్పర్స్ ను ఇస్తామని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నో సేవలు చూసిన వారికి.. తాజా సేవలు మాత్రం కాసింత చిత్రంగా ఉండటమే కాదు.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Tags:    

Similar News