గ‌ల్లా వర్సెస్ జేసీ... బాగా ముదిరిందే!

Update: 2017-09-10 16:06 GMT
వారిద్దరిలో ఒకరు.. ప్రస్తుతం తెలుగుదేశం తరఫున గుంటూరు ఎంపీగా ఉన్నారు. మరొకరు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు. వారే.. గల్లా జయదేవ్, జేసీ పవన్ కుమార్ రెడ్డి. ఇప్పుడు వీరిద్దరి మధ్య రాజుకున్నవివాదం ఎక్కడ పెద్దదవుతుందో, ఎక్కడ పార్టీ మెడకు చుట్టుకుంటుందోనని తెలుగుదేశం పార్టీ పెద్దలు భయపడుతున్నారట. విషయంలోకి వెళ్తే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ పేరుతో రెండు సంఘాలున్నాయి. ఒకదానికి గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. మరొకదానికి జేసీ పవన్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఏమిటంటరా.. వివాదం అంతా ఇక్కడే ఉంది. రాష్ట్రానికి కొచ్చి ఒకటే ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది, ఇప్పుడు వీరిద్దరు అసలు సిసలైన ఒరిజినల్ సంఘం మాదంటే.. మాదంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. కోర్టుల్లో ఒకరిపై ఒకరు కేసులు కూడా వేసుకున్నారు.

ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ పేరుతో గల్లా జయదేవ్ బోగస్ సంఘాన్ని నడుపుతున్నారంటూ జేసీ పవన్ మండిపడుతున్నారు. సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నుంచి గుర్తింపు తెచ్చుకున్నారని అంటున్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో ఆర్బిట్రేషన్ కమిషన్ ఏర్పాటు చేసిందని, వివాదాన్ని మూడు నెలల్లో పరిష్కరించాలని, అప్పటివరకు రెండు సంఘాల కార్యకలాపాలు, బ్యాంక్ ఖాతాలను నిలిపేయమని ఐఓఏను ఆదేశించిందని పవన్ చెబుతున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ కూడా తాను అధ్యక్షుడిగా ఉన్నదే ఒరిజినల్ సంఘం అని ఢంకా బజాయించి చెబుతుండటం గమనార్హం.

ఇద్దరూ రాజకీయంగా, ఆర్థికంగా బలవంతులైనవాళ్లే కావడం.. పైపెచ్చూ ఇద్దరూ తెలుగుదేశం నేతలే కావడంతో తెలుగుదేశం పెద్దలు ఎవరికి మద్దతివ్వాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారంట. సినిమా హీరో, హీరోయిన్లకు, క్రీడాకారులకు ఖరీదైన పార్టీలు ఇస్తూ జేసీ పవన్ మంచి గుర్తింపు పొందాడు. ఇందులో విశేషం ఏమిటంటే మహేశ్ బాబును తన ఫ్రెండ్ అని చెబుతుంటాడు పవన్. మరి స్నేహాన్ని కూడా లెక్క చేయక మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ పై ఒలింపిక్ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాడు. ఒక పక్క క్రీడాకారులు వీరిద్దరి వ్యవహార శైలితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జేసీ - జయదేవ్ లలో గెలుపు ఎవరిదో వేచిచూడాల్సిందే!
Tags:    

Similar News