ఏపీ బీజేపీ నేతలపై ఓపెన్ అయిపోయిన పవన్

Update: 2021-01-22 05:27 GMT
ఆల్ ఈజ్ వెల్.. అన్నట్లు ఇంతకాలం పైకి కనిపించిన బీజేపీ -జనసేన వ్యవహారం.. అదేమీ నిజం కాదని.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న విషయాన్ని జనసేనాది స్వయంగా వెల్లడించటం విశేషం. గ్రేటర్ ఎన్నికల వేళ  బీజేపీ నిర్ణయంతో పోటీ నుంచి పవన్ వెనక్కి తగ్గటం తెలిసిందే. అదే సమయంలో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి ప్లాన్ చేస్తున్న వేళ.. ఏపీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జనసేనాది ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్న వారి వ్యాఖ్యలపై గుర్రుగా ఉండటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తిరుపతిలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. సంచలనం గా మారాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం తనకు ఇస్తున్న మర్యాదతో పోలిస్తే.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు జనసేనకు తగిన మర్యాద ఇవ్వటం లేదన్న వ్యాఖ్య చేసినట్లుగా చెబుతున్నారు.

కలిసి ప్రయాణం చేయాలంటూ చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలని.. ఆ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పానని పేర్కొన్నారు. ఏపీ నేతల తీరులో మార్పు రావటం కోసం కేంద్ర నాయకత్వం చెప్పాల్సి ఉంటుందన్న ఆయన.. ‘వారు చెబితే ఇక్కడి నేతల తీరు మారుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన రాష్ట్ర నాయకత్వానికి లేదన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చామని.. మరో వారంలో కీలక ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. మరో రెండుసార్లు సిట్టింగ్ లు వేయనున్నట్లు చెప్పిన పవన్.. హైదరాబాద్.. మంగళగిరి.. ఢిల్లీలో కూర్చొని మాట్లాడతామన్నారు. ఒకవేళ.. జనసేన అభ్యర్థి పోటీ చేస్తే తిరుపతిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News