ఏపీ పోలీసు భ‌ద్ర‌త‌పై ప‌వ‌న్‌ అనుమానాలు!

Update: 2018-11-24 06:59 GMT
జ‌న‌సేన అధ్య‌క్షుడు సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌ద్ర‌తను ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం లైట్ తీసుకుంటోందా? జ‌న‌సేనానికి స‌హా ఆయ‌న బృందానికి వ‌రుస‌గా ఎదుర‌వుతున్న ప్ర‌మాదాల వెనుక మ‌ర్మం ఏంటి? అవి కాక‌తాళీయంగానే జ‌రుగుతున్నాయా లేక‌పోతే ప్ర‌ణాళిక‌లో భాగ‌మేనా?  కార‌ణాలు ఏవైనా ఎందుకు ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌డంలేదు...ఇవ‌న్నీ జ‌నసేన పార్టీ నేతల - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ప్ర‌స్తుతం ఎదుర‌వుతున్న సందేహాలు.

కొద్దికాలం క్రితం జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాన్వాయ్‌ ను ఓ ఇసుక లారీ ఢీకొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు ప‌వ‌న్ భ‌ద్ర‌త సిబ్బంది గాయాల పాల‌య్యారు. రాజాన‌గ‌రం వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని రోజుల‌కు - జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ హైద‌రాబాద్ వెళుతుండ‌గా - ఆయ‌న వాహ‌నాన్ని కూడా ఇసుక లారీ ఢీకొట్టింది. అనంత‌రం ప‌వ‌న్ ఫ్యాన్ అని పేర్కొంటున్న ఓ వ్య‌క్తి మండ‌పేట‌లో ప్ర‌జాపోరాట యాత్ర స‌మావేశం జ‌రుగుతున్న స‌మ‌యంలో ప‌వ‌న్ భుజాల‌పై నుంచి కండువా లాగే ప్ర‌య‌త్నం చేశారు. కాగా, ఈ ప‌రిణామాల‌పై జ‌న‌సేన అధ్య‌క్షుడు భ‌గ్గుమ‌న్నారు. ప్ర‌తిప‌క్ష‌ పార్టీ నేత‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వైప‌ల్యం చెందింద‌ని మండిప‌డ్డారు. ఈ విష‌యంలో ఏపీ డీజీపీ తీరును ఆయ‌న ప్ర‌శ్నించారు.

త‌మ‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని అనేక సంద‌ర్భాల్లో రాష్ట్ర పోలీసుల‌కు విన‌తి ప‌త్రం అందించామ‌ని - అయిన‌ప్ప‌టికీ త‌గు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆయ‌న ఆక్షేపించారు. ఒక‌వేళ త‌న‌కు ఏవైనా భ‌ద్ర‌త సంబంధ‌మైన స‌మ‌స్య‌లు ఎదురైతే దానికి రాష్ట్ర ప్ర‌భుత్వం - పోలీసులు బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ వైపు నిండా అవినీతిలో కూరుకుపోయింద‌ని, మ‌రోవైపు స‌ర్కారు త‌ప్పిదాల‌ను ప్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్షాల నేత‌ల భ‌ద్ర‌త విష‌యాన్ని గాలికి వ‌దిలేసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.


Tags:    

Similar News