పవన్ అక్కడ...నాగబాబు ఇక్కడ ?

నిజానికి నాగబాబుని రాజ్యసభకు పంపించి ఆ మీదట మోడీ కేబినెట్ లో మంత్రిగా చూడాలని పవన్ అనుకున్నారు అని వార్తలు వచ్చాయి.

Update: 2024-12-15 02:30 GMT

అవునా ఇది నిజమేనా అంటే పుకార్లు షికార్లు చేస్తున్నది మాత్రం ఈ విధంగానే అని అంటున్నారు. ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం లో నాగబాబు చేరబోతున్నారు అని అంటున్నారు. నాగబాబు చేరికతో కేబినెట్ పూర్తిగా నిండినట్లు అవుతుంది.

ఇదిలా ఉంటే నాగబాబు ప్రభుత్వంలో చేరుతారు అన్న వార్తలు రావడంతోనే విమర్శలు వచ్చి పడుతున్నాయి. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారని కూడా చర్చ సాగుతోంది. బంధు ప్రీతి అని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

అయితే ఈ విషయాలేవీ ఊహించలేని స్థితిలో పవన్ ఉన్నారు అంటే ఎవరూ నమ్మరు. ఆయనకు అది ఇష్టం కూడా ఉండదని అంటున్నారు. అయితే కొన్ని అనివార్యమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగబాబుని తెచ్చి ఏపీ కేబినెట్ లో అకామిడేట్ చేయాల్సి వస్తోందని అంటున్నారు.

నిజానికి నాగబాబుని రాజ్యసభకు పంపించి ఆ మీదట మోడీ కేబినెట్ లో మంత్రిగా చూడాలని పవన్ అనుకున్నారు అని వార్తలు వచ్చాయి. అది నిజమన్నట్లుగానే మోడీ కేబినెట్ లో జనసేన చేరలేదు. ఆరు నెలల క్రితం మూడవసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన కొత్త మంత్రివర్గంలో రెండు సీట్లు ఉన్న జేడీఎస్ కి కూడా పిలిచి పెద్ద పీట వేశారు. అలా కుమారస్వామి కేంద్ర మంత్రి అయ్యారు.

అవే రెండు ఎంపీలు ఉన్న జనసేనను కూడా కేంద్రంలో చేరమని కేంద్ర పెద్దలు స్వయంగా కోరారని వార్తలు వచ్చాయి. అయితే నాగబాబుని దృష్టిలో ఉంచుకునే పవన్ అప్పట్లో నో చెప్పారని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేనకు కచ్చితంగా చాన్స్ ఉంటుందని అంటున్నారు.

అందుకే ఆయనను రాజ్యసభకు పంపిస్తే ఎపుడు కేంద్ర మంత్రి మండలి విస్తరించినా చేరేందుకు వీలు కలుగుతుందని ఆలోచించారని అంటున్నారు. కానీ నాగబాబుకి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయినా ఏపీలో చాన్స్ దక్కలేదు. దాని కంటే ముందు ఢిల్లీ వెళ్ళిన పవన్ కేంద్ర పెద్దలతో ఇదే విషయం ప్రస్తావించి ఉంటారని కూడా ప్రచారం అయితే సాగింది.

అయితే బీజేపీ పెద్దలకు పవన్ ని కేంద్ర కేబినెట్ లోనికి తీసుకోవాలని ఉందని అంటున్నారు. ఆయన చేత ఇటీవల మహారాష్ట్రలో ప్రచారం చేయించుకుని బీజేపీ లబ్ధి పొందింది. ఆయనను కేంద్ర కేబినెట్ లో తీసుకుంటే మొత్తం దక్షిణాదికే ఆయనను ఒక కీలక నేతగా ఉంచాలని చూస్తోంది. పైగా సనాతన వాదిగా పవన్ ఇటీవల గట్టిగా మాట్లాడుతున్నారు. హిందూత్వ అజెండాను ఆయన తీసుకున్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక పవన్ కేంద్ర మంత్రిగా ఉంటే బీజేపీకి ఎక్కువ లాభం అని కేంద్ర పెద్దలు అంచనా వేస్తున్నారని అంటున్నారు. దాంతోనే నాగబాబుని ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.

ఇక 2026లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయని అందులో ఒకటి పవన్ కి కేటాయిస్తారని ఆ విధంగా ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి కేంద్ర మంత్రిగా తన సత్తా చాటుతారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీకి ఇంకా కావాల్సి వస్తే ఆయనను 2025లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏదో ఒక రాష్ట్రం నుంచి నామినేట్ చేసైనా తమ మంత్రివర్గంలోకి తీసుకునే చాన్సూ ఉందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే పవన్ ని తనతోనే ఉంచుకుని తమ వెంటే అట్టిపెట్టుకొని ఆయన ద్వారా సౌత్ ఇండియాని తమ వైపుగా తిప్పుకోవాలని బ్రహ్మాండమైన ఆలోచనతో బీజేపీ ఉందని అంటున్నారు. సో పవన్ నాగబాబు ఇద్దరూ మంత్రులుగా ఈ రోజుకు కనిపించినా అది ఎక్కువ కాలం కొనసాగదని పవన్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం తధ్యమని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News