ప్ర‌జ‌లు కొత్త పార్టీలు కోరుకుంటున్నార‌ట‌!

Update: 2018-10-03 17:09 GMT
ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్  - త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సినీ తారల జోరు కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - విశ్వ‌న‌టుడు క‌మల్ హాస‌న్ - హీరో విశాల్ ....రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్....రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్ర‌జాపోరాట యాత్ర చేస్తోన్న ప‌వ‌న్....త‌మిళ రాజ‌కీయాల‌పై స్పందించారు. త‌మిళ‌నాటు సంప్ర‌దాయ పార్టీలైన డీఎంకే - ఏఐ డీఎంకేల పాల‌న‌పై ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నార‌ని - కొత్త పార్టీల‌వైపు వారు మొగ్గు చూపుతున్నార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప‌శ్చిమ‌గోదావ‌రిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్....ఏపీ - త‌మిళ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌మిళ‌నాడులో ప్ర‌జ‌లు....అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల పాల‌న‌తో విసిగివేసారిపోయార‌ని ప‌వ‌న్ అన్నారు. అక్క‌డి ప్ర‌జ‌లు మార్పుకోరుకుంటున్నార‌ని చెప్పారు. ఏపీ, త‌మిళ‌నాడుతోపాటు చాలా రాష్ట్రాల్లో కొత్త పార్టీలు అధికారం చేప‌ట్టాల‌ని ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్నార‌ని, కొత్త నేత‌ల పాల‌న‌లో ప్ర‌జాసంక్షేమం ఉంటుంద‌ని వారు భావిస్తున్నార‌ని ప‌వ‌న్ అన్నారు. కొత్త నాయ‌కులు స‌మాజంలో మార్పు తీసుకువ‌స్తార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని ప‌వ‌న్ అన్నారు. త‌మిళ రాజ‌కీయాల్లో మార్పు తేవ‌డం కోసం ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల హాస‌న్ లు కొత్త పార్టీలు స్థాపించార‌ని, స‌మాజంలో వారు మార్పు తెస్తార‌ని అక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని అన్నారు. ఏపీ - తెలంగాణ‌ - త‌మిళ‌నాడుతోపాటు మిగ‌తా రాష్ట్రాల్లో కూడా కొత్త పార్టీలు, నాయ‌కులు రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని అన్నారు.

కొత్త పార్టీలు గెలుస్తాయా...లేదా అన్న‌ది ప్ర‌జ‌లు, కాలం నిర్ణ‌యిస్తుంద‌ని అన్నారు. జిగ్నేష్ మేవాని - హార్దిక్ ప‌టేల్ వంటి నాయ‌కులు ఉద్భ‌విస్తున్నార‌ని అన్నారు. అంతా బాగానే ఉంది కానీ...ఏపీలో ప్ర‌జ‌లు కొత్త పార్టీలు నాయ‌కులు కోరుకుంటే....జ‌న‌సేన‌కు 18 శాతం ఓటు బ్యాంకు మాత్ర‌మే ఎందుకు ఉంటుంద‌నే సందేహం క‌ల‌గ‌క మాన‌దు.  ఎందుకంటే, త‌న పార్టీకి 18 శాతం ఓటు బ్యాంకు ఉంద‌ని ప‌వ‌న్ స్వ‌యంగా చెప్పారు. అస‌లు ఆ మాట‌కొస్తే...ఇంకా నియోజ‌వ‌ర్గ అభ్య‌ర్థుల‌ను, ఇన్ చార్జిల‌ను పూర్తిగా నియ‌మించ‌ని ప‌వ‌న్....ఓటు బ్యాంకు గురించి మాట్లాడ‌డం హాస్యాస్పదం. మ‌రి ప‌వ‌న్ చెప్పిన‌ట్లు కొత్త పార్టీల‌కు ప్ర‌జ‌లు ఏమాత్రం ప‌ట్టం క‌డ‌తారో తెలియాలంటే 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News