పవన్ కల్యాణ్ లో చాలానే మార్పు వచ్చిందా?

Update: 2016-11-18 19:30 GMT
జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఆసక్తికరమైన కోణం ఈ మధ్యన దర్శనమిస్తోంది. తనదైన లోకంలో ఉండే ఆయన.. బయటకు రావటం చాలా అరుదుగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఉంటారన్న విషయం ఆయన సన్నిహితులకు తప్పించి మరెవరికీ తెలీదన్న మాటతో పాటు.. తరచూ ఏదో ఒక కార్యక్రమానికి హాజరు కావటం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదని.. అంతగా ఆసక్తి చూపించరన్నది తెలిసిందే. ఇదే విషయాన్ని పవన్ సైతం పలు సందర్భాల్లో చెబుతుంటారు.

తనకు సిగ్గు ఎక్కువన్న విషయాన్ని ఆయన మొహమాటం పడకుండానే ప్రస్తావిస్తుంటారు. ఇదే అంశాన్ని అయుధంగా చేసుకొని పవన్ ను విమర్శించే వారు ఆయన్ను తప్పు పడుతుంటారు. సినిమా నటులు ఎప్పుడూ రాజకీయ నేతలుగా మారలేరని.. వారు సగటు రాజకీయనేత మాదిరి ప్రజల్లో మమేకం కావటం పెద్దగా ఉండదని చెబుతుంటారు. ఇక.. పవన్ లాంటి స్టార్ హీరో జనాలతో తరచూ మమేకం కావటం సాధ్యమే కాదని చెబుతుంటారు. ఇదే అంశాన్ని విమర్శగా ప్రస్తావిస్తూ.. సినిమా నటుడిగా ఎక్కడో ఉండే పవన్ కు.. సగటు జీవి పడే కష్టం ఎలా తెలుస్తుందని..? ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చే పవన్ ప్రజల కష్టాల మీద పోరాటం చేస్తానని చెప్పటం హ్యాస్యాస్పదంగా ఉందన్న మాట ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేస్తుంటారు.

ఇలాంటి మాటలు పవన్ మీద ప్రభావం చూపాయో.. లేక.. సినిమా స్టార్ కు భిన్నంగా.. సగటు రాజకీయ నేతగా అన్ని కార్యక్రమాలకు హాజరు కావటం.. వీలైనంత తరచూ బయటకు కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తనను విపరీతంగా అభిమానించే వారికి సంబంధించిన కార్యక్రమాలకు సైతం ఆచితూచి హాజరయ్యే పవన్.. తన తీరుకు భిన్నంగా ఈ మధ్యన రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లోజరిగే శుభకార్యాలకే కాదు.. వేర్వేరు కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమానికి అతిధిగా హాజరైన పవన్ కల్యాణ్ అందరిని కాస్తంత ఆశ్చర్యపరిచారని చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలకు పవన్ హాజరు కావటం చాలా అరుదుని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా వచ్చిన మార్పు చూస్తే. సినిమా స్టార్ కంటే కూడా ప్రజల్లో ఒకడిగా ఉన్నట్లుగా ఉండటం.. రాజకీయ నేతలకు ఎలా అయితే అందరికి అందుబాటులో ఉంటారో అలానే తానూ ఉంటానన్న సంకేతాన్ని ఇచ్చేలా పవన్ తీరు ఉండటం గమనార్హం. మొత్తానికి పవన్ లో అవసరమైన మార్పు మొదలైందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News