ప‌వ‌న్...ఇపుడు చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌

Update: 2017-01-18 01:44 GMT
జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ కొత్త బాధ్య‌త‌ను నెత్తికి ఎత్తుకున్నారు.. తెలుగు రాష్ట్రాలలోని  చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపడడానికి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి ప‌వ‌న్  స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తెలంగాణా చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయంలో పవన్ క‌ళ్యాణ్‌ను మంగళవారం కలుసుకున్న సంద‌ర్భంగా ఈ మేర‌కు ప్ర‌క‌టించారు.

ప‌వ‌న్ కళ్యాణ్‌ను క‌లుసుకున్న చేనేత సంఘం నాయ‌కులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తున్న నేత కార్మికుల ఆకలిచావులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గత రెండున్నర సంవత్సరాలలో ఒక్క తెలంగాణాలోనే 45 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లోని  చేనేత కార్మికుల కష్టాలను విని చలించిపోయారు. నేత పనిగిట్టుబాటు కాక మరే ఇతర పని చేతకాక చేనేతకార్మికుడు తనువు చాలిస్తున్నాడని, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పారు. వచ్చేనెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం,  పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా పవన్ క‌ళ్యాణ్ ను కోరారు. అందుకు ప‌వ‌న్‌ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.

నేత కార్మికుల కష్టాలను సావధానంగా విన్న పవన్ క‌ళ్యాణ్  నేత కళ మన జాతి సంపద అని ఉద్వేగంగా అన్నారు. దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అంతేకాక నేత సంఘాల నాయకుల అభ్యర్థనపై చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా  స్వచ్చందంగా ఉంటానని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్రకటించారు. చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి తన శక్తి మేరకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News