ప్రచారానికి ఈరోజు పవన్ బ్రేక్ ఇచ్చేశారు

Update: 2019-04-06 07:45 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి బ్రేక్ చెప్పారు. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు నాలుగైదు రోజుల ముందు ఆయన అనారోగ్యానికి గురి కావటంతో ఆయన ప్రచార షెడ్యూల్ మొత్తం మారిపోయింది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం ఆయన గుంటూరు జిల్లా పరిధిలోని సత్తెనపల్లి.. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేయాల్సి ఉంది.

అయితే.. విజయనగరం జిల్లాలో ప్రచారం చేసిన సందర్భంగా ఆయనకు వడదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. గురువారం ఒక్కరోజులోనే చూస్తే.. ఏపీకి ఆ చివర ఉన్న విశాఖలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న పవన్.. ఆ తర్వాత ఏపీకి ఈ చివర ఉన్న తిరుపతిలో సభను నిర్వహించారు. అటు నుంచి హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఒక రోజు వ్యవధిలో ఇంత భారీగా ప్రయాణం చేయటం.. సమయానికి తగ్గట్లు ఆహారం తీసుకోకపోవటం కూడా పవన్ అనారోగ్యానికి కారణంగా చెప్పాలి.

శుక్రవారం షెడ్యూల్ ఇలా ఉండగా.. శుక్రవారం ఉదయం ఆయన విజయనగరంలో పర్యటించి..  ఆ తర్వాత విజయవాడ దగ్గర్లో సభలో పాల్గొన్నారు. ఎడతెరపి లేకుండా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంతో పవన్ డీహైడ్రేషన్ కు గురి కావటంతో ఆయన్ను హుటాహుటిన గన్నవరంలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం ఆయుష్ ఆసుపత్రికి పవన్ ను తీసుకెళ్లారు. అక్కడ ఐసీయూలో చికిత్స చేసిన తర్వాత శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. ఆయన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచన చేశారు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు (శనివారం) పవన్.. తన ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టారు. ఆయన పాల్గొనాల్సిన సభలను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పవన్ ఆరోగ్యం కుదుట పడి.. నీరసం తగ్గితే మాత్రం ఆయన మళ్లీ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News