వ‌రుస పూజ‌ల్లో ప‌వ‌న్ ఫుల్ బిజీ!

Update: 2018-05-15 10:19 GMT
పూజ‌ల మీద పూజ‌లు చేస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండా గుట్టుగా తిరుప‌తికి చేరుకున్న ఆయ‌న‌.. తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న వెళ్ల‌టం తెలిసిందే. ప‌వ‌న్ తిరుమ‌ల టూర్ గురించి తెలుసుకున్న ఆయ‌న అభిమానులు పెద్ద ఎత్తున ఆయ‌న‌తో క‌లిసి తిరుమ‌ల వ‌ర‌కూ కాలి న‌డ‌కన వెళ్లారు. మూడు రోజుల పాటు తిరుమ‌ల‌.. తిరుప‌తి చుట్టుప‌క్క‌ల పుణ్య‌క్షేత్రాల్ని ద‌ర్శిస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. అందుకు త‌గ్గ‌ట్లే వ‌రుస పెట్టి పూజ‌లు చేస్తున్నారు.

తాజాగా ఈ రోజు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండ‌లం గుడిమ‌ళ్లంలో శివాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. వికృత‌మాట గ్రామంలో వెంటేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్నారు. తాజాగా దేవాల‌యాలు సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మం పూర్తి అయిన త‌ర్వాత ఆయ‌న ఏపీ ప‌ర్య‌ట‌న‌ను స్టార్ట్ చేస్తార‌ని చెబుతున్నారు.

శ్రీ‌కాకుళం నుంచి బ‌స్సు యాత్ర‌ను పవ‌న్ ప్రారంభిస్తార‌ని.. ఈ యాత్ర అనంత‌పురం జిల్లా వ‌ర‌కూ సాగుతుంద‌ని చెబుతున్నారు. ఈ యాత్ర‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఇప్ప‌టికే కొన్ని క‌మిటీల‌ను నియ‌మించారు. ప‌వ‌న్ యాత్ర కోసం కాన్వాయ్ సిద్ధ‌మ‌వుతోంది.

బ‌స్సు యాత్ర‌ను చేప‌ట్టే ముందు త‌న‌కు సెంటిమెంట్ అయిన తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకొని.. ఆయ‌న ఆశీస్సులు తీసుకొని ముందుకు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అదే స‌మ‌యంలో చిత్తూరు జిల్లాలోని కొన్ని దేశాల‌యాల్ని ప్ర‌త్యేకంగా సంద‌ర్శించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ రోజుతో ప‌వ‌న్ దేవాల‌యాల సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మం పూర్తయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News