అమ‌రావ‌తి జ‌న‌సేన ఆఫీసులో ప‌వ‌న్ ఏం చేస్తున్నారంటే

Update: 2019-03-08 07:01 GMT
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అవ‌డంలో బిజీబిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 14న రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావించి అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తులో నిమ‌గ్న‌మయ్యారు.  తొలుత విజయవాడ వేదికగా సభ నిర్వహించాలని పవన్ భావించినా, అనేక అభిప్రాయాల అనంతరం వేదికను మార్చారు. మ‌రోవైపు వివిధ జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌తో ప‌వ‌న్ బిజీగా ఉండిపోయారు.

ఇలా పూర్తి బిజీ షెడ్యూళ్ల‌లో ఉన్న‌ తాజాగా ప‌వ‌న్ త‌న‌కు ఇష్ట‌మైన ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేసిన ప‌వ‌న్ గురువారం పార్టీ కార్యాలయం గోమాతలకు మేత వేసి వాటి ఆలనాపాలన గురించి వాకబు చేశారు. పాడి,పంట మన సంస్కృతిలో భాగం. ప్రకృతిని ప్రేమించడం, పశు పోషణ త‌న‌కు అమితమైన ఇష్టమ‌ని ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ చెప్పే సంగ‌తి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా స్వయంగా వ్యవసాయం చేసే ప‌వ‌న్ తాజా గోవుల సేవకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే పార్టీ కార్యాల‌యంలోనే త‌గు ఏర్పాట్లు చేశారు.

ఇదిలాఉండ‌గా, పొత్తుల విష‌యంలో ప‌వ‌న్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని స‌మాచారం. వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతోన్న జనసేనాని ఇప్ప‌టికే పలు దఫాలుగా మేనిఫెస్టోలో అంశాలను పార్టీ త‌ర‌ఫున‌ ప్రకటించారు. దీనిపై కసరత్తు సంతృప్తికర స్థాయిలో పూర్తయితే పార్టీ ఆవిర్భావ సభలోనే ప్రకటించే ఆస్కారం ఉంది. వామపక్షాలతో పొత్తులపై ప్రాథమికంగా చర్చలు జరిగినా, సీట్ల కేటాయింపు, ఎక్కడ పోటీచేయాలనే అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. పార్టీ కార్యాల‌యంలో ఉన్న స‌మ‌యంలో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News