ఆవేశం బాగా తగ్గి.. స్థిమితం పెరిగింది

Update: 2016-11-10 15:41 GMT
పవన్ కల్యాణ్ అంటే ఎందుకంత క్రేజ్? అన్న ప్రశ్నను ఎవరినైనా ప్రశ్నించండి. సూటిగా.. ఒక్క మాటలతో సమాధానం చెప్పలేకపోతారు. కాదు.. కచ్ఛితంగా ఒక్క మాటలోనే చెప్పాలన్న కండీషన్ పెడితే.. పవన్ అంటే పవనే అని మాత్రం చెప్పగలుగుతారు. మాటల్లో నిజాయితీ ఉట్టిపడటం.. మిగిలిన వారి మాదిరి హడావుడి చేయకపోవటం.. గుండె పొరల్లో నుంచి వచ్చేది మాత్రమే చెప్పటం.. తనలోని లోపాల్ని ఒప్పుకోవటానికి ఎలాంటి సందేహా పడకపోవటం.. సగటు మనిషి నిజాయితీతో వ్యవహరిస్తే ఎలా ఉంటాడో అచ్చం పవన్ అదే తీరులో ఉండటం అతనంటే జనాలకు పిచ్చ క్రేజ్ అని చెప్పాలి.

సామన్యులకు.. సెలబ్రిటీలకు తేడా భూమికి.. ఆకాశానికి మధ్యనున్న వ్యత్యాసం ఉంటుంది. కానీ.. పవన్ కల్యాణ్ విషయం కాస్త రివర్స్ లా ఉంటుంది. సెలబ్రిటీలా కనిపించినా సామాన్యుడిగా వ్యవహరిస్తుంటాడు. దయ కలిగిన వ్యక్తిత్వం.. సాయం చేసేందుకు ఎప్పుడు ముందు ఉండటం.. ఎవరికైనా.. ఏమైనా జరిగితే విలవిలలాడిపోవటం లాంటివి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంటాయి.

అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న గతంలో కొందరికి వచ్చినా.. అలాంటివేమీ సాధ్యం కావన్న వాదన వినిపించేది. అయితే.. కాల గమనంలో చోటు చేసుకున్న పరిణామాలు పవన్ ను రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందని చెప్పాలి. సమాజం పట్ల.. ప్రజల పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు.. వారికి ఏదైనా చేయాలన్న తపనతో పాటు.. వారికి జరిగే అన్యాయాల్ని ప్రశ్నించాలన్న తీరుతో.. జరుగుతున్న తప్పుల్ని చూసి తట్టుకోలేనితనం ఆయనలోని ఆవేశాన్ని బయటకు వచ్చేలా చేస్తాయని చెప్పాలి. అదే.. ఆయన్ను ఒక అర్థం లేని ఆవేశపరుడిగా చిత్రీకరించాయని చెప్పాలి.

తనను విమర్శించే వారికి మాటకు మాట అనని ఆయన తీరుతో పాటు.. మీడియాకు దూరంగా తన పని తాను చేసుకోవటంతో ఆయనపై నెగిటివ్ ప్రచారం భారీగా జరిగింది. కానీ.. అదే ఆయనకు పాజిటివ్ గా మారిందని చెప్పాలి. జనసేన ప్రారంభం నుంచి నేటి అనంతపురం సభ వరకూ చూస్తే.. ప్రతి బహిరంగ సభలోనూ ఆయన విపరీతమైన ఆవేశంతో సభకు రావటం కనిపిస్తుంటుంది.

తాజాగా జరిగిన అనంతపురం సభలో మాత్రం అందుకు భిన్నమైన ధోరణి స్పష్టంగా కనిపించింది. ఆయనలో ఆవేశం పాళ్లు చాలావరకూ తగ్గాయని చెప్పక తప్పదు. తిరుపతి.. కాకినాడ సభలతో పోలిస్తే.. అనంతపురం సభలో ఆయన సెటిల్డ్ గా మాట్లాడిన వైనం కనిపించక మానదు. ఆవేశంతో ఊగిపోవటం  చాలా వరకూ తగ్గిందని చెప్పాలి. కాకపోతే.. చెప్పే విషయాల్ని మరింత సూటిగా.. స్పష్టంగా అర్థమయ్యేలా చెబితే బాగుంటుందన్న భావన కలగక మానదు. తన మనసుకు ఏం అనిపిస్తే అదే చెప్పాలన్న మైండ్ సెట్ తో పాటు.. నాటకీయతను పండించటం.. తన మాటలతో జనాల్ని సమ్మోహనం చేయాలన్న తలంపు లేకపోవటం కూడా ఆయన మాటల్లో మెలోడ్రామా మిస్ కావటానికి కారణంగా చెప్పొచ్చేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News