జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని చెప్పిన ఆయన.. తాను వర్గ రాజకీయాలు చేయనని చెప్పారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. వాటిని తాను పట్టించుకోనని చెప్పారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏపీ విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు శత్రువు కాదని.. ఆ మాటకు వస్తే తనకు శత్రువులు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసమే టీడీపీకి మద్దతు ఇచ్చినట్లుగా చెప్పిన పవన్.. మోసాలు చేస్తే తాను ఒప్పుకోనని చెప్పారు.
జగన్ తనకు శత్రువు కాదన్న పవన్ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పార్టీ పెట్టేది అధికారంలోకి కాదన్నట్లుగా చెప్పే మాటలతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పాలి. ఈ తరహా మాటలతో పోటీ తత్త్వం తగ్గటమే కాదు.. రానున్న రోజుల్లో మరో లోక్ సత్తా పార్టీ మాదిరి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీ పెట్టింది పవర్ కోసం కానప్పుడు.. ఎన్జీవో పెట్టొచ్చు కదా.. రాజకీయ పార్టీ అని చెప్పి హడావుడి చేయటంలో అర్థం ఉందా? అన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. కాస్త ఈ సందేహానికి సమాధానం చెప్పండి పవన్ జీ.