కశ్మీర్ సమస్యనే పరిష్కరిస్తున్నప్పుడు కాపుల రిజర్వేషన్ ఎంత?

Update: 2019-08-05 13:30 GMT
దేశం యావత్తూ ఈ రోజు కశ్మీర్ విషయంపైనే మాట్లాడుతోంది. ఫేస్ బుక్, ట్విటర్.. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయినా కావొచ్చు కశ్మీర్ అనే పదం ట్రెండ్ అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ ట్రెండును పట్టుకున్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ కే పరిమితమైన కాపుల సమస్యను జాతీయ సమస్య అయిన కశ్మీర్‌ తో ముడిపెట్టి మంచి లాజిక్‌ తో మాట్లాడారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల అంశంపై దాదాపు తొలిసారి గట్టిగా మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే భవిష్యత్తులో ఇది పెను సమస్యగా మారిపోవడం ఖాయమని చెప్పిన ఆయన... జమ్మూకాశ్మీర్ లాంటి సమస్యకే పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నప్పుడు కాపు రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోలేకపోవడమేంటన్నారు.

''కాపుల రిజర్వేషన్లు విషయంలో మాటలు మార్చడం సరికాదు, కాపులు ఓసీ కాదు, బీసీ కాదు అంటూ సీఎం గందరగోళానికి గురిచేయడం కరెక్టు కాదని పవన్ అన్నారు. అయితే.. పవన్ ఇంతకాలం కాపుల పక్షాన మాట్లాడకపోవగా తొలిసారి కాపుల రిజర్వేషన్ అంశంపై బలంగా గొంతెత్తారు. అంతేకాదు.. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఇబ్బందేనని చెప్పడాన్ని ఆ సామాజికవర్గం ఆహ్వానిస్తోంది. ఎన్నికల ముందే పవన్ ఈ స్టాండ్ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని.. పవన్ ఇంతకాలం కాపులను దూరం పెట్టడం వల్లే నష్టపోయారని.. ఇకనైనా ఆ తప్పును సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.



Tags:    

Similar News