మీ భావాలు త‌ర్వాత‌.. ఆంధ్రోళ్ల భావాలు ఎవ‌రూ చెప్ప‌ట్లేదు ప‌వ‌న్‌

Update: 2019-01-28 14:30 GMT
పేరేంది.. ఆ.. ప‌వ‌నంట‌. అంటూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి 2014 ఎన్నిక‌ల వేళ‌లో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యను ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్ల‌ల మొద‌లు వృద్ధుల వ‌ర‌కూ అంద‌రికి సుప‌రిచిత‌మైన ప‌వ‌న్ ను.. అత‌డెవ‌రో తెలీద‌న్న‌ట్లుగా కేసీఆర్ మాట్లాడి చిన్న‌బుచ్చే ప్ర‌య‌త్నం చేయ‌టాన్ని మ‌ర్చిపోలేరు. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌స్తుగా ఫీల‌య్యారు. అయినా.. ఆయ‌న కేసీఆర్‌. ఏమైనా అంటాడు. ఏమైనా చేస్తాడు. ఆయ‌న‌కు ఎదురు చెప్పే ద‌మ్ము.. ధైర్యం తెలుగు నేల మీద ఎవ‌రూ లేర‌నే ప‌రిస్థితి. అది ఉద్య‌మ స‌మ‌య‌మైనా.. ఇప్పుడైనా స‌రే.

త‌న‌ను చిన్న‌బుచ్చేందుకు కేసీఆర్ మాట‌ల‌కు అప్ప‌ట్లో ప‌వ‌న్ కౌంట‌ర్ వేయ‌టం.. కేసీఆర్ ను ఉద్దేశించి కాస్త ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని మ‌ర్చిపోలేం. అయితే.. అదంతా గ‌తం. ప‌వ‌న్ ఎవ‌రో తెలీద‌న్న కేసీఆర్‌.. త‌ర్వాత ఆయ‌న్ను త‌న ఇంటికి పిలిపించుకోవ‌టం.. పిలిచినంత‌నే వెళ్లిన ప‌వ‌న్ ను.. గంట‌కు పైగా వెయిట్ చేయించిన కేసీఆర్ ను ప‌వ‌న్ ప‌ల్లెత్తు మాట అన‌లేదు.  ఆ మాట‌కు వ‌స్తే.. నాటి నుంచి ప‌వ‌న్ వైఖ‌రిలో ఎప్పుడూ లేనంత మార్పు వ‌చ్చేసింది.

జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. నాటి నుంచి నేటి వ‌ర‌కూ కేసీఆర్.. కేసీఆర్‌.. క‌విత‌ల‌ను ఉద్దేశించి ఒక్క మాట అంటే ఒక్క మాట అన్న‌ది లేదు. అంతేనా.. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిల‌వ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. తెలంగాణ అధికార ప‌క్ష పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ధ్య‌న కూర్చున్న ప‌వ‌న్‌.. వారిద్ద‌రితో క‌లిసి మాట్లాడిన తీరు ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. మ‌రింత సేపు మాట్లాడుకున్న మాట‌ల్లో ఒక్క మాట‌ను కూడా నిన్న‌(ఆదివారం) గుంటూరులో జ‌రిగిన  స‌భ‌లో మాట వ‌ర‌స‌కు ప్ర‌స్తావించింది లేదు. అయితే.. క‌ర‌చాల‌నం చేస్తే త‌ప్పు ప‌డుతున్నార‌ని.. త‌న‌కు చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌జాప్ర‌తినిధులంటే గౌర‌వమ‌ని అందుకే వారు ఎదురుప‌డిన‌ప్పుడు గౌర‌విస్తుంటాన‌ని చెప్పారు. మ‌రి ప్ర‌జాప్ర‌తినిధులంటే అంత గౌర‌వం అయితే పంచ‌లూడ‌దీసి కొడ‌తాన‌న్న మాట‌ను ఎందుకు అన్న‌ట్లు ప‌వ‌నా? అన్న ప్ర‌శ్న మ‌దిలో మెద‌ల‌క మాన‌దు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌మ భావాలు తెలియ‌జేయ‌టానికి ప్ర‌త్యేకంగా న్యూస్ చాన‌ళ్లు లేవ‌ని.. ఉన్న‌ద‌ల్లా పార్టీ సిద్దాంతాలు.. ఆశ‌యాల్ని ప్ర‌చారం చేయ‌టానికి కార్య‌క‌ర్త‌లేన‌ని ప‌వ‌న్ చెప్పారు. ప‌వ‌న్ కు కార్య‌క‌ర్త‌లైనా ఉన్నారు. కానీ.. ఆంధ్రాకి వాళ్లు లేరు. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. పార్టీ అధినేతలు.. పాల‌కులు మొద‌లుకొని ప్ర‌జ‌ల్లో ఎక్కువ మంది వ‌ర‌కూ ఆంధ్రా భావ‌న అస్స‌లు క‌నిపించ‌దు.

కేవ‌లం ఆంధ్రా కోస‌మే.. ఆంధ్రోళ్ల కోస‌మే.. వారి హ‌క్కుల కోసం.. వారి వేద‌న‌ల కోసం.. వారి వెత‌ల కోసం.. వారి మ‌న‌సుల్లో గూడుక‌ట్టుకున్న ఆవేద‌న‌కు గొంతుక అయ్యే మీడియానే కాదు.. ఏ రాజ‌కీయ పార్టీ కూడా లేక‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కోట్లాది మంది ఆంధ్రోళ్ల‌కే దిక్కు లేని వేళ‌.. త‌న‌కు లేద‌ని ప‌వ‌న్ ఫీల్ కావ‌టం అర్థం లేదు. అయినా.. ఆయ‌న మాట‌లు వినేందుకు తెలంగాణ‌లో పెద్ద మ‌నుషులు చాలా మందే ఉన్నారుగా. వారికి చెప్పుకోవ‌చ్చుగా!
Tags:    

Similar News