ఏపీ రాజకీయాలకు ఒక్క పవన్ సరిపోడు..

Update: 2018-10-07 06:54 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. ఆ మధ్య ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత కనిపించకుండా పోయిన పవన్.. తాజాగా పోలవరం పర్యటనకు వచ్చారు.పవన్ వస్తున్నాడని తెలిసి పలు గ్రామాల ప్రజలు, అభిమానులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు.  శనివారం రాత్రి పట్టిసీమ వద్దకు పవన్ రాగానే కార్యకర్తలు.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. రివర్ ఇన్ రిసార్ట్ లో ఆయన బస చేశారు. రిసార్ట్ వద్ద అభిమానులు డప్పులు మోగిస్తూ సందడి చేశారు.  ఆదివారం జనసేన పార్టీలో పలువురు నేతలు చేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం పోలవరం నేతలతో భేటికి నిర్ణయించారు.

అంతకుముందు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీలోని కుట్ర రాజకీయాలను ఎదుర్కోవాలంటే ఒకరిద్దరు పవన్ కళ్యాణ్ లు ఉంటే బాగుండనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అభిమానులు - కార్యకర్తలే పవన్ బలం బలగం అని.. మన సమర్థత - చిత్తశుద్ధి మీదే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని జనసేనాని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏపీలోని అధికార, ప్రతిపక్షాలకు జనసేనకు తేడాను పవన్  వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి వచ్చి నడిపిస్తున్నాడని.. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ స్ఫూర్తి నుంచి కాంగ్రెస్ వారిని వైసీపీలోకి తీసుకొచ్చాడని పవన్ కామెంట్ చేశారు. సంస్థాగతంగా వారి పార్టీలు బలంగా ఉండడానికి ఇది కారణమన్నారు. కానీ జనసేన అలా కాదని.. మనకు కొత్త తరం.. కొంత మంది అనుభవజ్ఞులు - సమాజం కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారని తెలిపారు. జనసేన రాటు దేలడానికి కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. తాను పాలసీల గురించి మాట్లాడుతానని.. ఇద్దరు వ్యక్తుల గురించి కాదంటూ పవన్ స్పష్టం చేశారు.

ప్రభుత్వాలు యువతకు ఉపాధి - ఉద్యోగాలు కల్పించకపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని వ్యాఖ్యానించారు. యువత బైక్ నడిపేటప్పుడు కానీ - వారి వాహనాల సౌండ్స్ వల్ల కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వేగం వల్ల ప్రమాదాలు పోతున్నాయని అందరికీ నచ్చేలా యువత ఉండాలని పవన్ సూచించారు. యుద్ధం చేసేప్పుడే శంఖం పూరించాలని.. యుద్ధం ఎప్పుడు చేయాలో నేను చెబుతానని.. అప్పుడు మనం బలంగా శంఖం పూరిద్దామని.. సంయమనం పాటించాలని సూచించారు.

* చింతమేనేనిపై డేవిడ్ రాజు ఫైర్

ఇక పవన్ కళ్యాణ్ పై పరుష విమర్శలు చేసిన దెందలూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జనసేన జిల్లా సమన్వయ కర్త డేవిడ్ రాజు మండిపడ్డారు. జనసైనికులు కదం తొక్కితే చింతమనేనికి పరాభవం తప్పదని హెచ్చరించారు. మచ్చలేని నాయకుడు పవన్ అని అన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన టీడీపీ.. ఇప్పుడు వైసీపీ, జనసేన కలిసిపోయాయని ఆరోపించడం సిగ్గుచేటు అని డేవిడ్ రాజు మండిపడ్డారు.


Tags:    

Similar News