చేపలవేపుడు.. మటన్ బిర్యానీ.. రొయ్యల ఫ్రై మాటలతో ఏసుకున్న జనసేనాని

Update: 2022-12-19 04:30 GMT
ఏపీ అధికార పార్టీపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సత్తెన పల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కాస్తంత సుదీర్ఘంగా మాట్లాడినా.. జగన్ సర్కారుపైన తన ఘాటు విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ సర్కారును దించటమే తన లక్ష్యమని.. అందుకోసం దేనికైనా సిద్ధమన్న విషయాన్ని చెప్పటమే కాదు.. తానేం చేస్తానన్న విషయాన్ని గతంలో కంటే మరింత వివరంగా.. విపులంగా మాట్లాడారు. అదే సమయంలో.. వైసీపీ అధినేత మీదా.. ఆ పార్టీ నాయకుల మీదా తీవ్రంగా మండిపడ్డారు.

మాచర్ల ఉదంతం నేపథ్యంలో రెచ్చగొట్టే మాటలు తాను మాట్లాడదలుచుకోలేదంటూ సంయమననాన్ని పాటించే ప్రయత్నం చేసి అందరి మనసుల్ని దోచుకున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం బీసీలపై చేస్తున్న వ్యాఖ్యలకు తనదైన కౌంటర్ ఇచ్చేశారు.

కొందరు బీసీ నేతలు చేస్తున్న ప్రకటనలపైనా ఆయన చురకలు అంటించారు. బీసీల పేరుతో కొందరు నాయకులు బాగుపడుతున్నారే తప్పించి.. ఆయా వర్గాలకు చెందిన ప్రజలు మాత్రం బాగుపడటం లేదన్నారు. బీసీ హాస్టల్స్ లోని దారుణ పరిస్థితుల్ని ప్రస్తావించిన పవన్.. చేతనైతే ఆ పరిస్థితుల్ని మార్చాలే తప్పించి.. బీసీల మీద ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడటం తగ్గించాలన్నారు.

తూర్పు కాపులతో తాను సమావేశం కాగానే.. వైసీపీ వారికి బీసీలు.. బీసీ గర్జన గుర్తుకు వచ్చిందన్న పవన్..  బీసీల సాధికారత కోసం వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యల్లోని డొల్లతనాన్ని బయటపెట్టేశారు. ''బీసీల సాధికారత కోసం వైసీపీ నాయకులు మాట్లాడే విషయాలు ఏంటి అంటే... బీసీలకు చేపల వేపుడు పెట్టాం.. మటన్ బిర్యానీ చేసాం.. రొయ్యల ఫ్రై పెడుతున్నాం అని చెబుతున్నారు'' అంటూ పంచ్ లు వేశారు.

''బీసీ వర్గాల సాధికరిత అంటే.. బీసీ వసతి గృహల్లో మెరుగైన పోషకాహారం పెట్టండి. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వండి. బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వండి.. వారికి ఫీజు రీయింబర్సుమెంట్ సకాలంలో అందేలా చూడండి. అప్పుడు మేం మీకు చక్కగా సహకరిస్తాం. మీకు ఎప్పుడు ఇతరులంటే విపరీతమైన చిన్న చూపు. వీళ్లు బిర్యానీలకు అమ్ముడుపోతారు.. వీళ్లకు మంచి ఫిష్ ఫ్రై పెడితే చాలు అనుకునే మనస్తత్వం'' అంటూ ఏకిపారేశారు.

అంతేకాదు.. 'అసలు బీసీలకు మీరు చేసిన మేలు ఏంటీ? ఎంత మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు..? ఎంత మందిని పారిశ్రామికవేత్తలు చేశారు..? ఎందరికి ఆర్ధిక భరోసా ఇచ్చారు?' అంటూ సూటి ప్రశ్నలు సంధించారు. తాను అడిగిన లెక్కలు చెప్పాలన్న పవన్.. ''బీసీ కులాలను అడ్డం పెట్టుకుని కొందరు నాయకులు ఎదుగుతున్నారు తప్పితే.. కులం వెనుకపడుతోంది. అలాగే కాపులు, ముస్లింలు సైతం వెనుకబడ్డారు. వారిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచించండి'' అని వ్యాఖ్యానించారు. బీసీలపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News