లక్ష్మీనారాయణ రాజీనామా పై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?

Update: 2020-01-30 18:17 GMT
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు జనసేన పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధినేత ప్రకటనను విడుదల చేసింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆయనకు శుభాభినందనలు తెలిపారు. వీవీ లక్ష్మీనారాయణ భావాలను తాము గౌరవిస్తున్నామన్నారు. అదే సమయంలో కౌంటర్ కూడా ఇచ్చారు.తన జీవితమంతా రాజకీయాలకేనని, సినిమాల్లో నటించనని పవన్ చెప్పారని, కానీ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోందని, అందుకే రాజీనామా చేస్తున్నానని వీవీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దీనిపై పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

పార్టీని నడిపేందుకు తన వద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు ఏమీ లేవని, కనీసం అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదని జనసేనాని పేర్కొన్నారు. తనకు తెలిసినది సినిమా ఒక్కటేనని, తన మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, వారి కోసం, తన కుటుంబం కోసం, పార్టీ ఆర్థిక పుష్టి కోసం తనకు సినిమాలు చేయడం తప్పనిసరిగా మారిందని స్పష్టం చేశారు.

వీటిని కూడా వీవీ లక్ష్మీనారాయణ తన రాజీనామాలో ప్రస్తావించి ఉండవలసినదని అభిప్రాయపడ్డారు. ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసినప్పటికీ, వ్యక్తిగతంగా తనకు, జనసైనికులకు ఆయనపై గౌరవం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు.


Tags:    

Similar News