అఖిల ప్రియ‌కు ప‌వ‌న్ షాక్‌!

Update: 2017-08-10 14:07 GMT
గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో టీడీపీకి - కేంద్రంలో బీజేపీకి జ‌న‌సేన‌ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ప‌లికారు. అపుడు ఆయ‌న ఆ రెండు పార్టీల‌కు బ‌హిరంగ మిత్రుడు. అయితే, త‌ద‌నంత‌ర కాలంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, ప్రత్యేక హోదా అంశంలో ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వంపై, అటు కేంద్ర ప్ర‌భుత్వంపై సంద‌ర్భానుసారంగా  విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అందులోనూ రాబోయే ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని స్వ‌యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో టీడీపీతో జ‌న‌సేన మిత్ర ప‌క్షంలా వ్య‌వ‌హ‌రిస్తుందా? లేక ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

కొద్దిరోజుల క్రితం ఏపీ సీఎం చంద్ర‌బాబు - ప‌వ‌న్ ల భేటీ సందర్భంగా ప‌వ‌న్ ను మీడియా ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నించారు. అయితే, తాను టీడీపీకి ర‌హ‌స్య స్నేహితుడిని కాద‌ని పవ‌న్ అన్నారు. దీంతో, టీడీపీ-జ‌న‌సేన దోస్తీ ప్ర‌స్తుతానికి తెగ‌లేద‌న్న‌సంకేతాలు ప‌వ‌న్ ఇచ్చిన‌ట్ల‌యింది. తాను నంద్యాల ఉప ఎన్నిక‌లో ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తానో నిర్ణ‌యించుకొని రెండు రోజుల్లో చెబుతాన‌ని ప‌వ‌న్ ఆ భేటీ సంద‌ర్భంగా అన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద రెడ్డికే మ‌ద్ద‌తివ్వాల‌ని ప‌వ‌న్ ను కోర‌తాన‌ని మంత్రి అఖిల ప్రియ అన్నారు. అయితే, ప‌వ‌న్ నుంచి ఈ విష‌యం పై ఎటువంటి స్పంద‌నా రాలేదు. మ‌ద్ద‌తు గురించి చ‌ర్చించేందుకు ప‌వ‌న్ అపాయింట్ మెంట్ కోసం అఖిల ప్రియ ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార - ప్ర‌తిప‌క్షాలు వాడి - వేడిగా ప్రచారం సాగిస్తున్నాయి. టీడీపీ ఆశ‌ల‌న్నీ ప‌వన్ కళ్యాణ్ పై పెట్టుకొని ఉంది.  ప‌వ‌న్ మద్దతు త‌మ‌కేన‌ని అఖిల ప్రియ మొద‌టి నుంచి ధీమాతో ఉన్నారు. ప‌వ‌న్ తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నందున ఆయన బ్ర‌హ్మానంద‌రెడ్డికే మద్దతిస్తారని  ఆమె చెప్పారు. ఇదే విష‌య‌మై ఆమె  పవన్ కళ్యాణ్ అపాయింటుమెంట్ అడిగారని, ఆయన అందుకు నిరాక‌రించాడ‌ని ప్రచారం సాగుతోంది. ఈ విష‌యంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్  డైలమాలో ఉన్నందునే అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేద‌ని వినికిడి.

ఒక వేళ పవన్ భూమా కుటుంబానికి మద్దతివ్వాలనుకుంటే ముందే ఇచ్చేవార‌నే వాద‌న వినిపిస్తోంది. రాజకీయాలు వేరు, కుటుంబం వేరు...అన్న సూత్రాన్ని ప‌వ‌న్ విశ్వ‌సిస్తారు. కుటుంబ ప‌రిచ‌యాల కోసం ప‌వ‌న్ గుడ్డిగా మద్దతు పలకరని అనుకుంటున్నారు. రాజకీయ లక్ష్యాల కోసం తాను సొంత అన్నయ్యనే పక్కన పెట్టానని ప‌వ‌న్ మీడియాతో అన్న సంగ‌తి తెలిసిందే. 2019లో జ‌న‌సేన ఒంటరిగా లేదా లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. అందుకే, ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు పల‌క‌డం లేద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఏదో ఒక పార్టీకి మ‌ద్దతివ్వాల్సి వ‌స్తే.... మిత్ర‌ప‌క్షం ధ‌ర్మం నెర‌వేర్చ‌డానికి ప‌వ‌న్ బ్ర‌హ్మానంద‌రెడ్డికి మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
Tags:    

Similar News