మాతో రాజకీయాల్లోకి వచ్చి..మా కార్యకర్తల్నే చంపేస్తామంటే ఊరుకుంటామా అన్నా రాంబాబు?

Update: 2021-01-23 05:10 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు సూటిగా వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. అసెంబ్లీకి ఎలా వెళతారో చూస్తామన్న ఆయన.. ‘‘ప్రజారాజ్యం పార్టీతోనే అన్నా రాంబాబు ఎన్నికల్లో గెలిచారు. మా ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. మా పార్టీ కార్యకర్తనే చంపేస్తామంటే ఊరుకుంటామా? అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో మేమూ చూస్తాం’’ అంటూ సూటిగా హెచ్చరించారు.

తానేదో సరదాగా సినిమాలు తీసుకునే వ్యక్తిని కాదని.. నిజ జీవితంలో గొడవలు పెట్టుకునే వ్యక్తినని చెప్పిన పవన్.. జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే తాను చేతులుకట్టుకొని కూర్చోనని చెప్పారు. ‘రక్తం మరగదా? కోపం రాదా? గొడవలు పెట్టుకోవటం ఎంత సేపు? వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. తమ ఊళ్లోని సమస్యల్ని పరిష్కరించాలని బండ్ల వెంగయ్యనాయుడు ఎమ్మెల్యే అన్నా రాంబాబుని అడిగితే భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో.. మనో వ్యధకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బలమైన రాక్షస సమూహంతో పోరాటం చేయటానికి మనమూ బలంగా వెళ్లాలి. అన్యాయం జరుగుతుంటే జనసేన ప్రశ్నిస్తుంది. అధికారంలోకి వచ్చే సత్తా జనసేనకు ఉంది’ అని పవన్ వ్యాఖ్యానించారు.

ప్రకాశం జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో వందల కోట్లు ఖర్చు చేయగలిగిన నాయకులు ఉన్నారని.. అయినా జిల్లా ప్రజలు ఎందుకు దుర్బర పరిస్థితుల్లో ఉన్నారని ప్రశ్నించిన పవన్ కల్యాణ్.. ఉద్దాణంలా కనిగిరిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయన్నారు. గ్రానైట్ తవ్వుకొని డబ్బు సంపాదించుకోవటానికే నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

ప్రకాశం పంతులు తర్వాత జిల్లాలో ప్రొఫెషనల్ నాయకులు అంటూ ఎవరూ లేరని.. ప్రకాశం జిల్లాకి మైనింగ్ చేసే నాయకులు కాకుండా.. ప్రజల గుండెల్లో పుట్టిన నాయకులు కావాలన్నారు. తమ గ్రామంలో సౌకర్యాల కోసం ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించిన వెంగయ్యను దారుణమైన పదజాలంతో దూషించటం.. సభ సమాజం పలకలేని భాషలో మాట్లాడటం సంచలనంగా మారింది. గ్రామ సమస్యల గురించి తనను ప్రశ్నించారన్న కోపంతో వివిధ మార్గాల్లో వెంగయ్యను బెదిరించిన ఎమ్మెల్యే.. అతడు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News