ప‌వ‌న్ అమెరికా టీం ఏపీలో ఎంట్రీ ఇచ్చింది

Update: 2017-07-29 09:31 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త‌న మాట‌ను నిల‌బెట్టుకునే క్ర‌మంలో క్రియాశీలంగా ముందుకు సాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై తొలిసారి  పవన్ కల్యాణ్ గళమెత్తిన సంగతి తెలిసిందే. ఆయన ఆందోళన ఫలితంగా రాష్ట్రప్రభుత్వం ఉద్దానం కిడ్నీ బాధితులపై అధ్యయనానికి హార్వర్డ్ వర్సిటీ బృందాన్ని తీసుకువచ్చింది. హార్వర్డ్‌ యూనివర్శిటీ వైద్య బృందం ఉద్దానానికి బయల్దేరింది. అక్కడ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఈ బృందం అధ్యయనం చేయనుంది.

పవన్‌ కల్యాణ్‌ వల్ల ఉద్దానంలో కిడ్నీ సమస్యలపై పూర్తి స్థాయి అధ్యయనానికి అవకాశం లభించిందని హార్వర్డ్‌ బృందం సభ్యుడు ఎస్‌. వెంకట్‌ సుధాకర్‌ తెలిపారు. ఉద్దానం ప్రజల కిడ్నీ సమస్య తీరాలనేదే తమ ఆశయమని అందుకోసం అందరితో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.  కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని, ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు కారణాలను తెలుసుకుంటామని వివ‌రించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఏం చేయాలనే అంశాలపై సూచనలిస్తామని బృంద సభ్యులు తెలిపారు. కాగా, రేపు హార్వర్డ్ బృందాన్ని పవన్ కల్యాణ్ కలవనున్నారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల31న భేటీ కానున్నారు. ఈ సంద‌ర్భంగా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై కీల‌క చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బాధితుల‌కు వైద్యంతో పాటుగా సామాజిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అంశాల విష‌యంలో ముఖ్య‌మైన నిర్ణ‌యాలు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో పాటుగా హార్వర్డ్ వర్సిటీ బృందం అభిప్రాయాల‌ను సైతం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు.
Tags:    

Similar News