మోడీ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ కి ఇన్విటేషన్ లేదు అంట....!?

Update: 2022-11-08 09:30 GMT
విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11, 12 తేదీలలో టూర్ చేయబోతున్నారు. మోడీ విశాఖలో రెండు రోజుల పాటు ఉంటారు. ఆయన ఒక రోజు రాత్రి కూడా బస చేయనున్నారు. మరి బీజేపీకి ఏపీలో ఏకైక మిత్రపక్షంగా జనసేన ఉంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ కంటే వారే ఎక్కువగా చెబుతారు. మరి అలాంటిది బీజేపీకి చెందిన ప్రధాని ఏపీకి వస్తే మిత్రపక్షాన్ని తప్పనిసరిగా ఆహ్వానించాలి. కానీ మోడీ సభకు హాజరుకావాలని పవన్ కళ్యాణ్ కి ఇన్విటేషన్ లేదు అని అంటున్నారు.

అలా ఎందుకు జరుగుతోంది అన్నదే ఇక్కడ చర్చ. ఈ మధ్య మంగళగిరిలో పవన్ కళ్యాణ్ బీజేపీ గురించి మాట్లాడినపుడు కూడా తనకు వేరే రాజకీయ  వ్యూహాలు ఉన్నాయని చెప్పారు. తాను రోడ్డు మ్యాప్ అడిగినా బీజేపీ  వారు ఇవ్వలేదని, మరో వైపు కాలం గడచిపోతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంతచేసినా తాను బీజేపీ బంధాన్ని తెంచుకుంటున్నట్లుగా పవన్ ఎక్కడా చెప్పలేదు. పైగా ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు గౌరవం చాలా ఉందని చెప్పుకొచ్చారు.

మరి అదే ప్రధాని విశాఖ టూర్ కి వచ్చినపుడు అధికారికంగా ఇంకా మిత్రులుగా ఉన్న ఈ రెండు పార్టీలు తప్పనిసరిగా వేదిక మీద కనిపించాలి. కానీ చూడబోతే అలాంటి సీన్ ని చూసే అవకాశం విశాఖ వాసులతో పాటు ఏపీ జనాలకు కూడా లేదనే అంటున్నారు. మోడీ సభకు పవన్ కళ్యాణ్ని పిలుస్తున్నారా అని మీడియా అంటే సోము వీర్రాజే నోరు విప్పలేదంటే ఇక ఇన్విటేషన్ ఆయనకు పంపడంలేదనే అంటున్నారు.

దానికి బీజేపీ వైపు నుంచి కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఇప్పటం టూర్ కి వెళ్ళినపుడు అక్కడ వామపక్షాల నాయకులతో ఆయన సమావేశం కావడం కమలనాధులకు మండిపోయేలా చేసింది అని అంటున్నారు. దానికంటే ముందు చంద్రబాబు తో విజయవాడలో ఒక హొటల్ లో పవన్ భేటీ వేశారు. గంట సేపు చర్చలు జరిపారు.ఆ తరువాత కూడా పవన్ కళ్యాణ్ మాకు మిత్రుడే అని చెబుతున్నా అవి పెదవి పైన వచ్చిన మాటలే తప్ప మనసులో నుంచి వచ్చినవి కావు అనే అంటున్నారు.

ఇక పవన్ తమతో పొత్తు లేదు అని అధికారికంగా నోరు విప్పి చెప్పకుండా తాను చేయాలనుకున్నది చేస్తున్నారు కాబట్టి తాను కూడా మాటలలో కాకుండా చేతలలోనే చూపించాలని బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే తమకు మిత్రుడుగా ఉంటూనే టీడీపీ కామ్రేడ్స్ తో దోస్తీకి ఉబలాటపడుతున్న పవన్ని తాము కూడా చెప్పకుండానే దూరం పెట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా పవన్ విషయం చూసుకున్నా ఆయన బీజేపీ బంధం విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని అంటున్నరు. తాను చెప్పాల్సింది చెప్పాను, రోడ్డు మ్యాప్ అడిగాను, అయినా సరే వారి నుంచి ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ రాలేదు అనే ఆయన చెబుతున్నారు. మరో వైపు పవన్ కానీ జనసైనికులు కానీ పొత్తు టీడీపీతో ఉంటేనే బెటర్ అన్న ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. బీజేపీతో కలిస్తే తమకు రాజకీయ అవకాశాలు బాగా తగ్గిపోతాయనే వారు ఊహిస్తున్నారు. అందువల్ల జనసేన రూట్ క్లియర్ గా ఉంది అని అంటున్నారు.

దాంతో ఆయన టీడీపీతో చంద్రబాబుతో టచ్ లో ఉంటున్నారు అని చెబుతున్నారు. దాంతో బీజేపీతో పెద్దగా అవసరం అయితే లేదు అనే అంటున్నారు. ఒక విధంగా పొత్తు లేదు ఏమీ లేదు అని బీజేపీ వారు చెప్పేస్తేనే బెటర్ అని పవన్ వైపు నుంచి ఆలోచనగా ఉంది. తన నోటి నుంచి ఆ మాట అనకుండా బంతిని వారి వైపు ఆయన తోసినట్లుగా కనిపిస్తోంది. అదే టైం లో బీజేపీ కూడా మాటలో పొత్తు ఉంది అనే చెబుతూ వస్తోంది.

కానీ చేతలలో చేయాల్సింది చేస్తోంది అని అంటున్నారు. మొత్తానికి బీజేపీ ఏపీలో ఒంటరిగానే ఉండాలని అనుకుంటోంది అని అంటున్నారు. అందుకే మోడీ సభను తామే సొంతంగా నిర్వహించాలని చూస్తోంది. తమకు ఏపీలో మిత్రుడు ఎవరూ లేరని చెప్పకనే చెప్పాలనే చూస్తోంది. సో పవన్ కి ఇన్విటేషన్ అన్నది పంపడంలేదు అని అంటున్నారు. ఇలా పైకి మాత్రం  మిత్రులుగా ఉంటూ లోపల రగులుతున్న ఈ రెండు పార్టీల పొత్తు బంధం ఎపుడు అధికారికంగా తెగిపోతుందో అన్నది వారికి కూడా తెలియదు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News