పీకే... పాలిటిక్స్ అంటే సినిమా కాదు!

Update: 2018-03-20 08:58 GMT
టాలీవుడ్ లో ప‌వ‌ర్ స్టార్‌ గా ఎదిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... అశేష అభిమాన గ‌ణం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టిదాకా పెద్ద‌గా ఇబ్బంది ప‌డిన దాఖ‌లా లేద‌నే చెప్పాలి. ప‌వ‌న్ కాలు బ‌య‌ట‌పెడితే... త‌మ అభిమాన హీరో వ‌చ్చేశాడంటూ తండోప‌తండాలుగా వ‌చ్చేసిన అభిమానుల‌తో నిజంగానే ప‌వ‌న్ చాలా బ‌లంగా క‌నిపించారు. ఒకానొక‌ప్పుడు ఓ మీడియా సంస్థ రాసిన క‌థ‌నంపై చిర్రెత్తుకొచ్చిన ప‌వ‌న్ పిస్ట‌ల్ బొడ్లో పెట్టుకుని మ‌రీ న‌డిరోడ్డు మీద‌కు వ‌స్తే... నాడు సికింద్రాబాదులో జ‌రిగిన హంగామా అంతా ఇంతా కాదు. న‌డిరోడ్డుపై ప‌వ‌న్ కూర్చుంటే... ఆయ‌న అభిమానులు మొత్తంగా ఆ ప్రాంతాన్నే బ్లాక్ చేసేశారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌ ను అక్క‌డి నుంచి లేప‌డం పోలీసుల‌కు కూడా సాధ్య‌ప‌డ‌లేదు. మొత్తంగా సినిమాల్లో ఉన్నంత కాలం ప‌వ‌న్ చాలా బ‌ల‌వంతుడే. సినిమాల్లోనే కాదండోయ్‌... నాలుగేళ్ల క్రితం జ‌న‌సేన పేరిట పార్టీ పెట్టిన ప‌వ‌న్ రాజ‌కీయాల్లోనూ తాను బ‌ల‌వంతుడిగానే చెప్పుకున్నారు. ఎందుకంటే... మీడియా మేనేజ్‌ మెంట్‌ లో దిట్ట‌గా ఎదిగిన టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌న బ‌లాన్ని చాలానే ఊహించుకున్నారు. అయితే రాజకీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు - శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న మాట ఉంది క‌దా. ఇప్పుడు కూడా అదే మాట ఏపీలో మ‌రోమారు నిజ‌మైపోయింది.

నాలుగేళ్లుగా క‌లిసి సాగిన టీడీపీతో తెగ‌దెంపులు చేసుకున్న ప‌వ‌న్‌... టీడీపీపై యుద్ధాన్నే ప్ర‌క‌టించేశారు. అయితే సినిమాల్లో హీరో మాదిరిగా యుద్ధం ప్ర‌క‌టిస్తే... విల‌న్ల మాదిరిగా మిగిలిన ప‌క్షాల‌న్నీ డంగైపోవ‌డం రాజకీయాల్లో ఉండ‌దు క‌దా. అదీ కాక ట‌క్కుట‌మారా విద్య‌లు నేర్చిన బాబు అండ్ కో ముందు నిల‌బ‌డ‌టం అంత ఈజీ ఏమీ కాద‌ని కాక‌లు తీరిన పొలిటీషియ‌న్లే చెబుతారు. అదే మాట ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలోనూ నిజ‌మైపోయింది. టీడీపీతో క‌లిసి ఉన్నంత కాలం బ‌ల‌మైన రాజ‌కీయ ప‌క్షంగానే క‌నిపించిన జ‌న‌సేన‌... ఆ పార్టీతో విబేధించిన మ‌రుక్ష‌ణం నుంచి అస‌లు సిస‌లు రాజ‌కీయ‌మంటే ఎలా ఉంటుందో జ‌న‌సేన‌కు తెలిసి వ‌చ్చింద‌నే చెప్పాలి. అయినా రాజ‌కీయ‌మంటే... స్ప‌ష్ట‌మైన ప‌థ‌క ర‌చ‌న‌తో బ‌రిలోకి దిగాలి. ఎంత పకడ్బందీగా నిర్దేశించుకున్న వ్యూహం ఏమాత్రం బెడిసికొట్టినా అంతే సంగ‌తులు. ఆ త‌ర‌హా అనుభ‌వాలు లేని ప‌వ‌న్‌... సినిమాల్లో మాదిరే రాజ‌కీయాల్లోనూ తాను బ‌లవంతుడిన‌నే న‌మ్మారు. మ‌రి ఆ బ‌లమంతా ఇప్పుడు ఏమైంద‌న్న ప్ర‌శ్నఇప్పుడు బాగానే వినిపిస్తోంది.

అయినా నిన్న‌టిదాకా రాజ‌కీయాల్లో ప‌వ‌న్‌ కు ఉన్న బ‌లం ఇప్పుడు ఎక్క‌డికెళ్లిపోయింద‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందే రాజ‌కీయ పార్టీ పెట్టిన ప‌వ‌న్‌... ఎన్నిక‌ల్లో బీజేపీ - టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చేసి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో అటు కేంద్రంలో బీజేపీ - ఇటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ప‌వ‌న్ అధికార కూటమికి మిత్రుడిగా మిగిలిపోయారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ ను ఎవ‌రేమ‌నాల‌న్నా కూడా జ‌డిసిపోయేవారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లాంటి ధీరోదాత్త రాజ‌కీయ నాయ‌కులు మిన‌హా మిగిలిన నేత‌లెవ్వ‌రూ ప‌వ‌న్ పేరును ప‌లికేందుకు కూడా జ‌డిసిపోయార‌నే చెప్పాలి. అయితే టీడీపీకి క‌టీఫ్ చెప్పిన మ‌రుక్ష‌ణ‌మే ప‌వ‌న్‌ కు రాజ‌కీయాల్లో అస‌లు సినిమా క‌నిపించ‌డం మొద‌లైంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

నిన్న‌టిదాకా టీడీపీతో కలిసి ఉన్న కార‌ణంగా టీడీపీ అనుకూల మీడియా అంతా ప‌వ‌న్‌ ను బాగానే మోసింది. అయితే టీడీపీతో తెగ‌దెంపులు చేసుకున్న ప‌వ‌న్‌ను ఇప్పుడు అదే మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అంతేనా... సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్‌ పై చాలా ఘాటు వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. వీటిని స‌మ‌ర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ప‌వ‌న్ చాలానే గ్రౌండ్ వ‌ర్క్ చేయాల్సి ఉంది. టీడీపీతో మైత్రి నేప‌థ్యంలో పెద్ద‌గా ఇబ్బందులు తెలియ‌ని ప‌వ‌న్... అస‌లు పార్టీ నిర్మాణంపైనే దృష్టి సారించ‌లేద‌నే చెప్పాలి. మ‌రి పార్టీ ప‌టిష్ఠం కాక‌ముందే టీడీపీకి దూరంగా జ‌రిగిన ప‌వ‌న్‌... ఆ పార్టీని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఎక్క‌డిక‌క్క‌డ ప‌క్కా వ్యూహంతో విరుచుకుప‌డే టీడీపీ బ్యాచ్ ముందు ప‌వ‌న్ ఏమాత్రం నిల‌బ‌డ‌తార‌న్న అనుమానాలు కూడా లేక‌పోలేదు. మొత్తంగా ప‌వ‌న్‌ కు ముందున్న కాలం ముస‌ళ్ల పండ‌గేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News