జనసేన.. ఆటలో అరటిపండేనా?

Update: 2019-03-05 01:30 GMT
జనసేన.. ఎన్నికల ఆటలో అరటిపండు అయ్యిందా.? ఏపీ అసెంబ్లీతోపాటు పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆ పార్టీలో ఎలాంటి ఉలుకూ - పలుకూ లేకపోవడం విస్మయపరుస్తోందా.? టీడీపీ - వైసీపీ ఓ వైపు గెలుపు గుర్రాలైన అభ్యర్థుల వేట మునిగితేలుతుంటే.. కనీసం పోటీచేయడానికి నాయకులు లేక జనసేన సతమతమవుతుందా.? అసలు జనసేనాని ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు? పవన్ పోటీచేస్తారా.? లేదా షరామామూలుగా ఏదైనా పార్టీకి మద్దతిస్తారా.? ఇస్తే తీసుకునే పొజిషన్ లో వైసీపీ - టీడీపీ ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.. సామాన్య ప్రజానీయం నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు ‘పవన్.. ఎన్నికల దారెటు’ అంటూ చర్చించుకుంటున్నారు..

జనసేన ఇప్పుడు ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. అదే సమయంలో ఒంటరిగా బరిలోకి దిగే సాహసం చేయడం లేదు. ముందుగా టీడీపీతో కలిసి మరోసారి పొత్తు పెట్టుకొని జనసేన బరిలోకి దిగుతుందని వార్తలొచ్చాయి. పవన్ కు నాలుగు ఎంపీ - 25 అసెంబ్లీ సీట్లను చంద్రబాబు ఇస్తానన్నడని ప్రచారం జరిగింది. ఎందుకో గానీ పవన్ స్టెప్ బ్యాక్ వేశాడని వార్తలొచ్చాయి.

ఇక చంద్రబాబు ఆఫర్ కాలదన్నాక.. పవన్ ను వైసీపీ నేతలు సంప్రదించారన్న వార్తలొచ్చాయి.కానీ వైసీపీతో చెలిమికి ఆదిలోనే చెడింది. జగన్ ఏనాడు పవన్ ను పట్టించుకోలేదు. పొత్తుకు వెంపర్లాడలేదు. కానీ  జగన్ ను టార్గెట్ చేసి తిట్టడం మొదలు పెట్టాడు పవన్.. దీంతో జగన్ అంతే ఘాటుగా బదులివ్వడంతో వైసీపీ-జనసేన పొత్తు చర్చలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

టీడీపీ ఆఫర్ ఇచ్చినప్పుడు వెనకడుగు వేసిన పవన్.. వైసీపీతో ముందుకెళ్దామని ఆలోచించినట్టు ప్రచారం జరిగింది. తీరా వైసీపీ పొమ్మన్నాక టీడీపీ చాన్స్ ఇవ్వడం లేదట.. సో ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పవన్ పొత్తు కోసం వెంపర్లాడినా.. అటు టీడీపీ.. ఇటు వైసీపీ టికెట్లను ఖాయం చేస్తూ జనసేనను పట్టించుకునే పరిస్థితిలో లేవని పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు ఎటూ కాకుండా జనసేన ఆటలో అరటిపండు అయిపోయిందని జనసేనలోని కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా వాపోతున్నారట..

టీడీపీ, లేదా వైసీపీతో పొత్తు పెట్టుకొని ఈసారి పోటీచేస్తే కనీసం 10 నుంచి 20 సీట్లు అయినా గెలుచుకునేదని.. ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగితే జనసేన ఉనికే ప్రశ్నార్థకం కావచ్చని రాజకీయ విశ్లేషకులు - జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
   

Tags:    

Similar News