షాక్‌: ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన నేత అరెస్టు

Update: 2017-10-22 05:22 GMT
నీతి, నిజాయితీతో కూడిన రాజ‌కీయాల‌కు చిరునామాగా త‌న పార్టీ జ‌న‌సేనను నిల‌బెడ‌తాన‌ని ప‌దే ప‌దే చెప్పిన జ‌న‌సేనాని ప‌వ‌న్ కళ్యాణ్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆయ‌న పార్టీకి చెందిన అధికార ప్ర‌తినిధిని బెదిరింపు, మార‌ణాయుధాలు, ఛీటింగ్ వంటి కీల‌క‌మైన కేసుల కింద హైద‌రాబాద్ పోలీసులు  శ‌నివారం అరెస్టు చేశారు. దీంతో ఒక్క‌సారిగా ఏపీ, తెలంగాణ‌ల్లోని జ‌న‌సేనాని అభిమానులు, పార్టీ కేడ‌ర్ తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాయి. జ‌న‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధిని అని చెప్పుకుని తిరుగుతున్న క‌ల్యాణ్ సుంక‌ర అనే యువ‌కుడు చీటింగ్ కేసులో పోలీసుల‌కు అడ్డంగా బుక్క‌య్యాడు. త‌న మోసం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భ‌యంతో అత‌డు ఏకంగా ఎయిర్ పిస్ట‌ల్ తో బాధితురాలితో పాటు ఆమె వెంట వ‌చ్చిన వారిని కూడా బెదిరించాడు. అయితే ఓ టీవీ ఛానెల్‌లో యాంక‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌ద‌రు బాధితురాలు నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో స‌ద‌రు యువ‌కుడి గుట్టు ర‌ట్టు అయ్యింది. అంతేకాకుందా పోలీస్ స్టేష‌న్‌లోనే తాను ఓ రాజ‌కీయ పార్టీకి చెందిన నేత‌న‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నాన‌ని పోలీసుల‌నే బెదిరించేందుకు య‌త్నించాడు. అయితే ఆ యువ‌కుడికి షాకిచ్చిన పోలీసులు... అత‌డిపై ఛీటింగ్‌, బెదిరింపులు, దౌర్జ‌న్యం కింద కేసులు న‌మోదు చేశారు.

ఆ ఘ‌ట‌న  పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి హోదాలో ప‌లు టీవీ ఛానెళ్ల‌లో జ‌రిగిన లైవ్ షోల‌లో పాలుపంచుకున్నాడ‌ని భావిస్తున్న క‌ల్యాణ్ సుంక‌ర‌... ఓఎల్ఎక్స్‌లో ఐఫోన్ 7ను విక్ర‌యానికి పెట్టాడు. ఈ ప్ర‌క‌ట‌న చూసిన స్వాతి అనే ఓ టీవీ యాంక‌ర్ అత‌డిని సంప్ర‌దించింది. ఈ క్ర‌మంలో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన స‌ద‌రు యువ‌తికి... త‌న ఐఫోన్‌7 గురించి వివ‌రిస్తూ... రూ.56 వేల‌కు కొన్న త‌న ఐఫోన్‌7ను తాను 16 రోజులు మాత్ర‌మే వాడాన‌ని, దానిని ఇప్పుడు రూ.44వేల‌కే ఇస్తున్నాన‌ని చెప్పాడు. దీంతో స‌రేన‌న్న స్వాతి అత‌డికి డ‌బ్బిచ్చి సెల్ ఫోన్ తీసుకున్నారు. ఈ మార్పిడి మొత్తం రాత్రి వేళ జ‌ర‌గ‌డంతో అప్ప‌టిక‌ప్పుడే ఆ ఫోన్‌ను యువ‌తి ప‌రిశీలించ‌లేద‌ట‌. ఇంటికెళ్లి చూస్తే... త‌న చేతిలో ఉన్న‌ది ఓ పాడైన సెల్ ఫోన్ అని తెలుసుకుని స్వాతి షాకైంది. త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చిన క‌ల్యాణ్ ఫోర్డ్ ఎండీవ‌ర్ కారులో రావ‌డంతో అస‌లు ఈ త‌ర‌హా మోసం జ‌రుగుతుంద‌నే భావ‌నే ఆమెకు రాలేద‌ట‌. తాను మోస‌పోయానన్న విష‌యాన్ని గ్ర‌హించిన వెంట‌నే క‌ల్యాణ్‌కు ఫోన్ చేసి నిల‌దీస్తే... చిల‌క‌ల‌గూడ పార్కుకు వ‌స్తే డ‌బ్చిస్తాన‌ని చెప్పాడు. తాను చెప్పిన‌ట్లే మ‌రునాడు పార్కు వ‌ద్ద‌కు వ‌చ్చిన స్వాతి కుటుంబ స‌భ్యుల‌ను అత‌డు ఎయిర్ పిస్ట‌ల్‌తో బెదిరించాడు.

దీంతో షాక్ తిన్న స్వాతి నేరుగా చిల‌క‌ల‌గూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఫ‌లితంగా పంచాయ‌తీ పార్కు నుంచి పోలీస్ స్టేష‌న్‌కు మారిపోయింది. అయితే పోలీసుల‌ను కూడా బురిడీ కొట్టించేందుకు క‌ల్యాణ్ సుంక‌ర రాజ‌కీయ నాయ‌కుడిన‌న్న అంశాన్ని బ‌య‌ట‌కు తీశారు. తాను జ‌న‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధిన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నాన‌ని చెబుతూ పోలీసుల‌ను బెదిరించేందుకు య‌త్నించాడు. అయితే ఆ విష‌యాన్ని కాస్తంత లైట్‌గా తీసుకున్న పోలీసులు క‌ల్యాణ్‌పై ఆ ఘ‌ట‌న కేసు న‌మోదు చేశారు. ఆ వెంట‌నే స్వాతి కుటుంబ స‌భ్యుల‌ను బెదిరించేందుకు య‌త్నించిన ఎయిర్ గ‌న్‌తో పాటు అతడు వాడిన ఎండీవ‌ర్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో జ‌న‌సేన‌కు చెందిన శ్రేణులు ఒక్క‌సారిగా షాక్‌కు గురైన‌ట్లు స‌మాచారం. నిబద్ధ‌త క‌లిగిన రాజ‌కీయ నేత‌ల‌ను త‌యారుచేస్తామ‌ని ఓ వైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టిస్తే... క‌ల్యాణ్ సుంక‌ర లాంటి వాళ్లు జ‌న‌సేన అధికార ప్ర‌తినిధుల‌మంటూ చెప్పుకుంటూ న‌యా మోసాల‌కు పాల్ప‌డుతుండ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News