ఇలా చేసేవేంటి పవన్?

Update: 2019-04-11 07:50 GMT
తాను మీలో ఒకడినని.. అతి సామాన్యుడినని అంటుంటాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచార సమయంలో నేలపై కూర్చుని చద్ది అన్నం తినడం లాంటి ఫీట్లు మహ బాగా చేస్తాడు. కానీ ఎన్నికల రోజు జనాలతో కలిసి క్యూలో నిలబడి ఓటు వేయడం మాత్రం పవన్ వల్ల కాలేదు. ఏదో సినిమా వేడుకకు వచ్చినట్లే హడావుడి చేసింది పవన్ అండ్ టీం. విజయవాడలో ఓటు వేసేందుకు వచ్చి పవన్ తన బృందంతో చేసిన హడావుడి పెద్ద చర్చనీయాంశం అయింది. ఎండలో వందల మంది పోలింగ్ బూత్ ముందు నిలబడి ఉంటే.. పవన్ తనకేదో ప్రత్యేక అధికారాలున్నట్లుగా నేరుగా బూత్ లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఒక్కడిగా బూత్ లోపలికి వెళ్లి ఓటు వేసి వచ్చినా బాగుండు. కానీ చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది, అనుచరులతో వచ్చాడు. వాళ్లు మామూలు హంగామా చేయలేదు.

మామూలుగా సినిమా వేడుకలకు పవన్ వస్తే.. చుట్టూ బౌన్సర్లు నిలబడి.. పవన్‌ను చూసేందుకు ఎగబడే జనాల్ని ఎలా పడితే అలా నెట్టేస్తుంటారు. దురుసుగా ప్రవర్తిస్తుంటారు. పోలింగ్ బూత్‌ లో కూడా అదే పరిస్థితి కనిపించింది. పవన్ చుట్టూ ఉన్న అతడి మనుషులు.. ఓటు వేసేందుకు వచ్చిన జనాల మధ్య అక్కడ హడావుడి నెలకొంది. ఎవరు ఏంటి అని చూడకుండా అందరినీ ఎలా పడితే అలా నెట్టేయడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. ముసలి వాళ్లు, మహిళలు అని చూడకుండా అందరితోనూ పవన్ సహాయకులు దురుసుగా ప్రవర్తించడంతో పవన్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పటికే ఎండ వల్ల ఇబ్బంది పడుతున్న జనాలు.. వీళ్ల హంగామాతో మరింత అసహనానికి లోనయ్యారు. పవన్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేసే పరిస్థితి వచ్చింది. పవన్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదంటూ అక్కడి జనాలు విమర్శించారు. గతంలో పవన్ అన్న చిరంజీవి హైదరాబాద్‌లో ఇలాగే క్యూలో నిలబడకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లబోతే.. ఒక ఓటరు అభ్యంతరం చెప్పడం.. అందరూ కలిసి నినాదాలు చేయడం.. చిరు సారీ చెప్పి క్యూలో వచ్చి ఓటు వేయడం తెలిసిన సంగతే.
Tags:    

Similar News