ప‌వ‌న్ కామెంట్: స‌త్యం మాట్లాడినందుకే శ‌త్రువుని

Update: 2018-03-15 12:25 GMT

జ‌న‌సేన అధినేత - సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్  తన రాజ‌కీయ దూకుడు కొన‌సాగిస్తున్నారు.  పార్టీ ఆవిర్భావ సభతో ఏపీ రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్  దాన్ని మ‌రింత కొన‌సాగేందుకు క్రియాశీలంగా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. తాజాగా విజయవాడలో ప్రవాస తెలుగు ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికా - యూకే - సింగపూర్ - మలేసియా - యూఏఈల నుంచి వచ్చిన వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'మెరుగైన జీవితం కోసం విదేశాలకి వెళ్లి కష్టపడి వృద్ధిలోకి వస్తున్నవారు మన ఎన్నారైలు. ఎన్నారైలు అనగానే డబ్బులు పిండేద్దాం అనుకొంటున్నారు... ఆ పద్దతి పోవాలి. మీ నుంచి జనసేన పార్టీకి కావలసింది మేధో సహకారం' అని సూచించారు.

పార్టీ ఎన్నారై విభాగం ఎప్పటికప్పుడు ప్రవాస తెలుగు ప్రజలకి తోడ్పాటుగా ఉంటుందనీ, అలాగే విదేశాల్లో వున్న తెలుగు వారు రాష్ట్రానికి ఏమి చేయాలో ఆలోచన చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. 'విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ.. సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అమ్మానాన్నలకు ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే సరైన వైద్యం అందుబాటులో ఉండటం లేదు. మనం పన్నులు కడుతున్నప్పుడు ప్రభుత్వం తన బాధ్యతలు నిర్వర్తించాలి కదా? ఈ  ధోరణిలో మార్పు తీసుకొద్దాం. ముందుగా మీలో ఉన్న భయాన్ని తీసేయండి. ఈ తరం బాధ్యత గల పాలనా వ్యవస్థని కావాలని ఆశిస్తుంది. తీసుకొద్దాం. ఆ మార్పు అనేది సహజంగా రావాలి. నిశ్శబ్డ విప్లవం తీసుకొద్దాం. విప్లవం అంటే రక్తపాతాలు కాదు. బయటకి వచ్చి గొడవలు చేయాల్సిన పని లేదు. మీ పనులు చేసుకొంటూనే సమాజం కోసం ఆలోచన చేయండి. మీకున్న పరిచయాలతో... నెట్వర్క్ ద్వారా మన రాష్ట్రానికి ఏమి చేయాలో అది చేయండి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై మన పార్టీ ప్రస్తావించినప్పుడు.. ఎన్నారై  సబ్బిశెట్టి గారు తన పరిచయాలతో హార్వర్డ్ వైద్య నిపుణులతో సంప్రదింపులు చేశారు. ఆ వైద్య నిపుణులను ఇక్కడికి తీసుకు వచ్చారు. అలా మీకు ఉన్న నెట్వర్క్ ద్వారా చాలా చేయొచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, ఉపాధి కల్పన లాంటి అంశాలపై దృష్టిపెడదాం. నేను ఇటీవల కదిరి వెళ్తే... ఓ ముస్లిం మహిళ బాధ పడుతూ తన కుమార్తెను ఏజెంట్ మోసం చేసి గల్ఫ్ పంపిస్తే ఆచూకీ కూడా లేదని చెప్పింది. ఆ యువతిని తిరిగి రప్పించడం పై ఆలోచన చేస్తున్నా. అక్కడ ఉన్న ఎన్నారైలు ఇలాంటి సమస్యపై సహకారం ఇవ్వొచ్చు.` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఎవరికీ వ్యక్తిగత శత్రువులు ఉండరని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. `సత్యం మాట్లాడితేనే శత్రువులు వస్తారు. ఒకటి గమనించాలి... సత్యం మాత్రమే గెలుస్తుంది. సమకాలీన రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే... మాట్లాడకుండా వారికి ఊడిగం చేయాలని కోరుకొంటున్నారు... అది ఇక కుదరదు. కులప్రాతిపదికగా రాజకీయాలు చేస్తున్నారు. సమాజాన్ని సమగ్రంగా చూసే విధానం రావాలి. నేను తప్పు చేసినా... ఓ జనసేన కార్యకర్త అవినీతి చేసినా వెనకేసుకు రావద్దు.. ఖండించాలి` అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. `సింగపూర్ తరహా పాలన అంటే అక్కడ తప్పు చేస్తే తనవాళ్ళనైనా శిక్షిస్తారు. గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ ఖర్చు చేశామన్నారు... ఏమైపోయాయి? మంచి నీటిలో మురుగు కలిసిపోయి 10 మంది అతిసారంతో చనిపోయారు. ఎంత బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో మన తరఫున ఏమి చేయగలం... అండర్ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ విదేశాల్లో ఎలా ఉంది... అక్కడి నిపుణుల సలహాలు ఏమిటో ఎన్నారైలుగా మీరు ఆలోచన చేయండి. అయితే రాజకీయ నాయకులూ అంత సులభంగా చేయనీయరు` అని అన్నారు.

`20 ఏళ్ల కిందట తమ్ముడు సినిమా 100 వేడుక చేస్తే అయ్యే ఖర్చుతో నల్గొండ జిల్లాలో ఆర్వో ప్లాంట్లు ద్వారా రక్షిత తాగు నీరు ఇద్దామని వెళ్తే అక్కడి రాజకీయ నాయకులు నీకేం పని అన్నట్లు మాట్లాడారు. అయినా సమాజానికి ఉపయోగపడాలి... అండగా ఉండాలి అనే నా ఆలోచనలో మార్పు రాలేదు. ఎక్కడా పోరాటం ఆపం. రాజకీయ సామాజిక ఆర్థిక మార్పు కోసం పోరాడదాం. ఓ మహానుభావుడు చెప్పినట్లు 'బలంగా అనుకోని ఒకరు వెన్ను నిటారుగా నిలిపితే... వంగిపోయిన వెన్నులు కూడా  నిటారుగా నిలబడతాయి'. మనం బలంగా అనుకొందాం. మార్పు సాధిద్దాం.`` అని తెలిపారు.

`ఏమి చేసినా ఎవరూ పట్టించుకోరు అనుకోవద్దు... ధర్మం అనేది ఒకటి ఉంటుంది. నోట్ల రద్దు తరవాత ఎన్నో ఇబ్బందులు జనం పడితే... ఉత్తరప్రదేశ్ కి ఎక్కువ నోట్లు పంపించారు. జనం గమనిస్తూనే వున్నారు. ఓటు ద్వారా సామాజిక మార్పు తీసుకువద్దాం. ఎన్నారైలుగా మీరు ఏ స్థాయిలో పనిచేయగలరో ఆ విధంగా చేయండి. స్వతంత్ర పోరాట యోధుల్లా అన్నీ విడిచిపెట్టి రావాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ బాధ్యతలు చూసుకొంటూ సమాజానికి ఏ విధంగా సేవ చేయాలీ... సామాజిక మార్పు తీసుకు రావాలో ఆ విధంగా చేయండి. మీ ఆర్థిక, వ్యక్తిగత భద్రత కూడా చూసుకోండి. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పలు దేశాల నుంచి మహాసభకు వచ్చారు. ట్రంప్ ఆంక్షలతో వీసా సమస్యలున్నా అమెరికా నుంచి వచ్చారు... మీరంతా క్షేమంగా తిరిగి వెళ్ళాలి. మీ అందరి అండదండలు కావాలి" అన్నారు.

Tags:    

Similar News